ముద్ర‌గ‌డకు మ‌ద్ద‌తు త‌గ్గుతోందా?

ముద్ర‌గ‌డకు మ‌ద్ద‌తు త‌గ్గుతోందా?

సోష‌ల్ మీడియా కేంద్రంగా సాగుతున్న‌ విభిన్న‌మైన చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారింది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపునిస్తే ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ఆ ప్రభావం గట్టిగా కన్పిస్తుండేది. ఇటీవలి ఘటనలు చూసుకున్నా ఆ ప్రభావం ఈ జిల్లాల పరిధిలో భారీ స్థాయిలోనే కన్పించటం అందరికి తెల్సిందే. అలాంటిది ముద్రగడ పద్మనాభం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఛలో అమరావతి పాదయాత్ర నేపధ్యంలో గతంతో పోలిస్తే ఆస్ధాయిలో పశ్చిమలో ప్రభావం కన్పించకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది అంతా పరిస్థితి గుంభనంగా ఉందన్న అభిప్రాయానికే తావిస్తోంది తప్ప గతంతో పోలిస్తే ముద్రగడ పిలుపు ప్రభావం అంతగా తగ్గలేదన్న వాదనే విన్పిస్తోంది.

ముద్రగడ పాదయాత్ర వ్యవహారం గత కొన్నినెలలుగా రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ విస్తృత ప్రచారంలో ఉండటం తెల్సిందే. మరోవైపు ఈ పాదయాత్రకు అనుమతి లేదంటూ ప్రభుత్వాధినేతలు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ముందునుంచి చెపుతూనే ఉన్నారు. ఇలాంటివాటిలో పాల్గొని భవిష్యత్ నాశనం చేసుకోవద్దంటూ విద్యార్ధులకు వారు పిలుపు కూడా ఇవ్వటం గమనార్హం. అదే సమయంలో పాదయాత్ర ముహుర్తం దగ్గరపడిన కొద్ది పోలీసులు నిర్బంధం పెరిగిందని ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు, బైండోవర్ కేసులు, ముందస్తు అరెస్టులు జరిగిపోవటమే ప్రభావం అంతగా కన్పించలేదన్న అభిప్రాయానికి కారణమవుతోందని కాపునేతలు పేర్కొంటున్నారు. మరోవైపు అధికారపార్టీపరంగా, ప్రభుత్వపరంగాను కూడా ముందస్తు భారీ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల, ముద్రగడ ఉద్యమతీరు ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాని నేపధ్యంలో స్వచ్చంధంగానే ఆ వర్గానికి చెందిన కొంతమంది నేతలు, యువత కూడా దూరంగా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తం కావటం గమనార్హం.

అయితే తొలి రోజు నుంచి కాపు సంఘాలు అక్కడక్కడ తమ స్వరాన్ని విన్పిస్తూ ఆందోళనలు కొనసాగించటం విశేషంగానే చెప్పుకోవచ్చు. ముద్రగడ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఛలో అమరావతి పాదయాత్ర చివరకు ఆయన ఇల్లు దాటకపోవటం, పోలీసుల నిర్బంధం మరింతగా కన్పించిన నేపథ్యంలో ఆ తర్వాత నుంచి ఈ ఉద్యమ ప్రభావం అంతగా కన్పించడం లేదనే చ‌ర్చ సాగుతోంది. రాబోయే కాలంలో ఆందోళనలు, నిరసనలు చేపట్ట‌నున్నార‌ని...ముంద‌స్తుగా పోలీసు నిర్బంధంలో చిక్కుకుని అసలు ఉద్యమ సమయంలో అందుబాటులో లేకుండా పోతామన్న జాగ్రత్తలో కొంతమంది నేతలు, కార్యకర్తలు ఉన్నట్లు చెపుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు