కేసీఆర్‌కు కోపం వ‌చ్చేసింది

కేసీఆర్‌కు కోపం వ‌చ్చేసింది

తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు పెద్ద‌పీట వేస్తూ త‌న‌దైన శైలిలో దూసుకెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. తెలంగాణ ప్ర‌యోజ‌నాలకు విఘాతం క‌లిగించేలా ఎవ‌రు వ్య‌వ‌హ‌రించినా ఊరుకునేది లేద‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే ప‌లుమార్లు స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. తాజాగా మోడీ స‌ర్కారుపై గుస్సా ప్ర‌ద‌ర్శించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.
ఇవాల్టి రోజున న‌చ్చినా.. న‌చ్చ‌కున్నా మోడీ స‌ర్కారుపై గ‌ట్టిగా మాట్లాడే ద‌మ్మున్న అధినేత‌లు కాస్త త‌క్కువ‌నే చెప్పాలి. అయితే.. మిత్రుడిగా ఉంటూనే.. ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌టం మామూలు విష‌యం కాదు. అలాంటి తీరును ప్ర‌ద‌ర్శిస్తున్న ఏకైక అధినేత కేసీఆర్ మాత్ర‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ మ‌ధ్య‌న అమ‌ల్లోకి వ‌చ్చిన జీఎస్టీపై తెలంగాణ రాష్ట్రం తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే. ప్ర‌జ‌ల మీద బాదేసే జీఎస్టీ గురించి తెలంగాణ స‌ర్కారు స్పందించ‌లేదు. కానీ.. ప్రాజెక్టుల మీద విధించిన జీఎస్టీ మీద కేసీఆర్ స‌ర్కారు గుర్రుగా ఉంది. పెద్ద ఎత్తున ప్రాజెక్టుల్ని అమ‌లు చేస్తున్న తెలంగాణ‌లో జీఎస్టీ పుణ్య‌మా అని దాదాపు రూ.19 వేల కోట్ల వ‌ర‌కూ భారం ప‌డే అవ‌కాశం ఉండ‌టంతో.. ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల మీద విధించిన జీఎస్టీని వెంట‌నే మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే ప‌లు వేదిక‌ల మీద ఈ అంశాన్ని టీఆర్ఎస్ నేత‌లు లేవ‌నెత్తారు. అయిన‌ప్ప‌టికీ.. కేంద్రం దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ కీల‌క నిర్ణ‌యం తీసుకోలేదు. ఇలాంటి వేళ‌.. కేసీఆర్ పెద‌వి విప్పారు. జీఎస్టీ మీద త‌న‌కున్న అభ్యంత‌రాల్ని తీవ్ర స్వ‌రంతో వెల్ల‌డించ‌ట‌మే కాదు.. న్యాయ‌పోరాటం చేస్తామ‌న్న హెచ్చ‌రిక చేశారు. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న‌.. త‌మ మాదిరే మిగిలిన రాష్ట్రాల‌కు జీఎస్టీతో భారీ భారం ప‌డటం ఖాయ‌మ‌ని.. ఈ నేప‌థ్యంలో ఈ అంశంపై జాతీయ స్థాయిలో ప‌లువురు ముఖ్య‌మంత్రుల్ని కూడ‌గ‌ట్టి కేంద్రం మీద ఒత్తిడి తెస్తామ‌న్న మాట‌ను చెబుతున్నారు.
ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల మీద 12 శాతం జీఎస్టీ అమ‌లు చేయ‌టాన్ని జాతీయ స‌మ‌స్య‌గా ప‌రిగ‌ణించాల‌న్న మాట‌ను చెప్పిన కేసీఆర్‌.. నీటిపారుద‌ల‌.. మిష‌న్ భ‌గీర‌థ‌.. గృహ‌.. ర‌హ‌దారుల నిర్మాణం లాంటి కార్య‌క్ర‌మాల‌కు జీఎస్టీ ఎత్తి వేయాల‌ని కోరుతున్నారు.

జీఎస్టీ రాక ముందు ప్రారంభించి.. ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న ప్రాజెక్టు ప‌నుల‌కు 12 శాతం జీఎస్టీ వ‌సూలు చేయ‌టాన్ని కౌన్సిల్ నిర్ణ‌యించ‌టాన్ని కేసీఆర్ త‌ప్పు ప‌డుతున్నారు. జీఎస్టీ రాక‌ముందు టెండ‌ర్లు పిలిచి చేస్తున్న ప‌నుల‌కు 12 శాతం ఎలా వ‌సూలు చేస్తామ‌న్న‌ది కేసీఆర్ సూటిప్ర‌శ్న‌గా చెప్పాలి. ఈ తీరుతో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు పెద్ద ఎత్తున న‌ష్టం వాటిల్లితుంద‌ని.. అంచ‌నాల వ్య‌యం విప‌రీతంగా పెరుగుతుంద్న ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. తాను లెవ‌నెత్తుతున్న అంశాల్ని మిగిలిన రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ద్ద‌తు తీసుకొని మోడీ స‌ర్కారు దృష్టికి తీసుకెళ‌తామ‌ని చెబుతున్నారు కేసీఆర్‌. ఈ నెల 11న ఉప రాష్ట్రప‌తిగా వెంక‌య్య‌నాయుడు ప్ర‌మాణ‌స్వీకారానికి ఢిల్లీ వెళ్లే  వేళ.. ప్ర‌ధాని మోడీతో భేటీ అవుతార‌ని.. ఈ సంద‌ర్భంగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల  మీద త‌న‌కున్న అభ్యంత‌రాల్ని ఆయ‌న దృష్టికి తీసుకెళ్ల‌నున్నట్లుగా చెబుతున్నారు. మోడీ మీద గుస్సా టోన్ వినిపించిన కేసీఆర్  తీరు ఇప్పుడు అంద‌రిని ఆక‌ర్షిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు