బ్యాడ్ టైం: కాంగ్రెస్ కు మ‌ళ్లీ షాక్‌!

బ్యాడ్ టైం: కాంగ్రెస్ కు మ‌ళ్లీ షాక్‌!

ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు టైం ఎంత‌మాత్రం బాగున్న‌ట్లుగా లేదు. దెబ్బ మీద దెబ్బ ప‌డుతూ ఆ పార్టీకి దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలోకి కూరుకుపోతోంది. గుజ‌రాత్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రాజ‌కీయ స‌ల‌హాదారు అహ్మ‌ద్ ప‌టేల్‌ను గెలిపించుకునేందుకు ఆ పార్టీ ప‌డుతున్న ప్ర‌యాస అంతా ఇంతా కాదు.
ఇంత క‌ష్ట‌ప‌డుతున్నా.. సానుకూల ఫ‌లితం క‌నిపించ‌ని ప‌రిస్థితి.

ఇప్ప‌టికే జంప్ జిలానీ ఎమ్మెల్యేల షాక్ నుంచి తేరుకోక ముందే.. బెంగ‌ళూరు క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యే గ‌దుల్ని.. వారి మంచి చెడ్డ‌లు చూసుకునే క‌ర్ణాట‌క మంత్రి మెడ‌కు ఐటీ సోదాలు చుట్టుకున్నాయి. ఇది స‌రిపోద‌న్న‌ట్లుగా తాజాగా సుప్రీంకోర్టు నుంచి వ‌చ్చిన తీర్పు ఆ పార్టీని మ‌రింత డీలా ప‌డేలా చేస్తుంద‌ని చెప్పాలి.

గుజ‌రాత్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నోటాను వినియోగించ‌కుండా స్టే విధించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన కాంగ్రెస్ పార్టీ అప్పీలును సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నోటా ఆప్ష‌న్‌పై 2014లో నిబంధ‌నావ‌ళి జారీ చేస్తే ఇప్పుడు కోర్టుకు రావ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నించింది. తాజా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నోటా ఆప్ష‌న్ ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ ఆప్ష‌న్‌ను వినియోగిస్తే.. మొద‌టికే మోసం రావ‌టం ఖాయ‌మంటున్నారు.

అదే జ‌రిగితే.. పార్టీ అధినేత్రి.. త‌న సొంత మ‌నిషిని కూడా గెలిపించుకోలేని దీనస్థితిలోకి దిగ‌జారి పోతారు. ప్ర‌త్య‌ర్థిని ఉక్కిరిబిక్కిరి చేసి..ఊపిరాడ‌కుండా చేయ‌టంలో మోడీ ఎంత సిద్ధ‌హ‌స్తుడ‌న్న వైనం తాజా ప‌రిణామాలు చూస్తే.. ఇట్టే అర్థ‌మ‌వుతాయ‌ని చెబుతున్నారు. ఏమైనా.. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నోటాపై స్టే వ‌స్తుంద‌ని ఆశ‌ప‌డిన కాంగ్రెస్‌కు.. అందుకు భిన్న‌మైన ఆదేశం రావ‌టంతో.. రాజ్య‌స‌భ ఎన్నిక తుదిఫ‌లితంపై కాంగ్రెస్ లో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు