శిల్పాతో జగన్ రాజీనామా చేయిస్తాడా?

శిల్పాతో జగన్ రాజీనామా చేయిస్తాడా?

ఫిరాయింపు రాజకీయాల విషయంలో వైఎస్ జగన్మోహన రెడ్డి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. తాను చాలా నీతి గల రాజకీయాలు చేస్తానని, గతంలో కాంగ్రెస్ నుంచి తన పార్టీలో చేరిన వారంతా రాజీనామాలు చేసి మళ్లీ నెగ్గి స్వచ్ఛంగా చేరారని అంటుంటారు. తన పార్టీనుంచి తెలుగుదేశం లోకి వెళ్లిన వారంతా నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తూ ఉంటారు. ఆయన వాదనను తప్పుపట్టక్కర్లేదు. ప్రజాప్రతినిధులుగా నెగ్గిన తర్వాత ఫిరాయించిన వారి విషయంలో వేటు వేసే కఠిన చర్యలు ఒక పట్టాన కొలిక్కి రాకపోవడం అనేది.. ఒక రాజకీయ రివాజుగా మారిపోయిన తరుణంలో ఇలాంటి విమర్శలు, వాదోపవాదాలు తప్పవు.

అయితే ఇప్పుడు జగన్ కూడా ఇలాంటి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఎందుకంటే.. తెలుగుదేశం ప్రాపకంతో ఎమ్మెల్సీ అయిన శిల్పా చక్రపాణి రెడ్డి ఇవాళ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అలాగే తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలో విజయం సాధించడానికి పాటు పడబోతున్నారు. ఈ సమయంలో.. నీతిగల రాజకీయాల బాటను తాము విడచిపెట్టలేదని నిరూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి, కొత్తగా తనతో జట్టు కడుతున్న శిల్పా చక్రపాణి రెడ్డితో కూడా రాజీనామా చేయిస్తారా? అనేది రాజకీయ వర్గాల్లో బహుదా చర్చనీయాంశంగా ఉంది.

కానీ ఒక్క విషయం మాత్రం నిజం. విశ్లేషకులు అంచనా వేస్తున్నదేంటంటే.. శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా చేయడం అనేది అసాధ్యమైన విషయం. కాకపోతే.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడెల్లా... ‘‘ముందు మా పార్టీ గుర్తు మీద గెలిచి.. తెదేపాలో చేరిన వాళ్లందరినీ రాజీనామా చేయమని చెప్పండి.. ఆతర్వాత శిల్పా చక్రపాణి రెడ్డి కూడా తప్పకుండా రాజీనామా చేస్తారని మాత్రమే వారంటారు. ఇటూ వీరు గానీ, అటు చక్రపాణి గానీ రాజీనామా చేయడం అంటూ జరగకపోవచ్చు. అయినా.. రాజీనామాలు చేయకపోయినా పర్లేదు గానీ.. వైకాపా వాళ్లు భవిష్యత్తులో మళ్లీ.. ‘మా పార్టీ గుర్తు మీద గెలిచి ఫిరాయించిన వాళ్లంతా విలువల్లేని వాళ్లు, వెంటనే రాజీనామా చేసి దమ్ముంటే ప్రజల వద్దకు వెళ్లి మళ్లీ గెలవాలి’ లాంటి పాచిపోయిన పాట పాడకుండా ఉంటే బాగుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు