మోదీ వ్యూహాల‌కు తంబీలు చిత్తు కాక త‌ప్ప‌దా?

మోదీ వ్యూహాల‌కు తంబీలు చిత్తు కాక త‌ప్ప‌దా?

దేశంలో ప్రాంతీయ పార్టీల హ‌వా కొన‌సాగుతున్న రాష్ట్రాలు చాలానే ఉన్నా... ద‌క్షిణాదిలో ప్రాంతీయ పార్టీల బ‌లం ఇంకెక్క‌డా క‌నిపించ‌దు. ద‌క్షిణాదిలోనూ ప్ర‌త్యేకించి త‌మిళ‌నాడులో జాతీయ పార్టీల‌కు ఇసుమంత స్థానం కూడా ద‌క్క‌డం లేదు. త‌మిళ తంబీల ప్రాంతీయాభిమాన‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా రాజ‌కీయ విశ్లేష‌కుల వాద‌న‌గా వినిపిస్తోంది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో త‌న స‌త్తా చాటాల్సిందేన‌ని క‌మ‌ల‌నాథులు ఉవ్విళ్లూరుతున్నారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాల ఏలుబ‌డిలోకి వ‌చ్చేసిన బీజేపీ... ఇప్పటిదాకా ఉత్త‌రాదిలో ఘ‌న విజ‌యాల‌నే న‌మోదు చేసింద‌ని చెప్పాలి. మొన్న‌టి ఎన్నిక‌ల్లో చాలా కాలం త‌ర్వాత ఉత్త‌ర ప్ర‌దేశ్ లో పాల‌నా ప‌గ్గాల‌ను ద‌క్కించుకున్న క‌మ‌లనాథులు తాజాగా... బీహార్‌లోనూ అధికారాన్ని పంచుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఈ క్ర‌మంలో దక్షిణాది వైపు దృష్టి సారించిన ఆ పార్టీ చాలా కాలం క్రితం నుంచి కూడా త‌మిళ‌నాట పాగా వేయాల‌ని వ్యూహాలెన్నో ర‌చించింది. అన్నాడీఎంకే అధినేత్రి, త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో అక్క‌డ ఏర్ప‌డ్డ రాజ‌కీయ శూన్యాన్ని త‌న‌కు అనువుగా మ‌ల‌చుకున్న మోదీషా ద్వ‌యం... ఇప్పుడు ఏకంగా ఆ రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేను మ‌ళ్లీ త‌న వ‌ద్ద‌కు తీసుకొచ్చుకునే ప‌నిని ప్రారంభించేసింది. గ‌తంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న‌ప్ప‌టికీ.. అన్నాడీఎంకే మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాత్రం ఒంట‌రిగానే పోటీ చేసింది. త‌మిళ‌నాట  అత్య‌ధిక లోక్ స‌భ సీట్ల‌ను కైవ‌సం చేసుకున్న అన్నాడీఎంకే... ఇప్పుడు పార్ల‌మెంటులో 50 మంది స‌భ్యుల‌తో బీజేపీ, కాంగ్రెస్‌ల త‌ర్వాత అతి పెద్ద పార్టీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎలాగైనా అన్నాడీఎంకేను తిరిగి ఎన్డీఏలోకి లాగే కార్య‌క్ర‌మానికి తెర తీసిన మోదీషా ద్వ‌యం... ఆ ప‌నిని ఓ సీనియ‌ర్ బీజేపీ నేత భుజ‌స్కందాల‌పై పెట్టిన‌ట్లుగా ప్ర‌చారం సాగింది.

స‌ద‌రు నేత ఇటీవ‌ల త‌మిళ‌నాడులో ప‌ర్య‌టించి మోదీషాల వ్యూహాన్ని ప‌క్కాగా అమ‌లు చేసి... అన్నాడీఎంకేను త‌మ దారిలోకి తెచ్చుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ ప్లాన్ వ‌ర్క‌వుటైంద‌ని చెప్పేందుకు ఇప్పుడు ప‌క్కా నిద‌ర్శ‌నంగా చెబుతున్న విష‌యం ఏమిటంటే... త్వ‌ర‌లోనే అన్నాడీఎంకే మోదీ కేబినెట్ లో చేర‌బోతోంద‌ట‌. 50 మంది స‌భ్యుల బ‌లం ఉన్న అన్నాడీఎంకేకు ఎన్ని మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌న్న విష‌యం ఒక్క‌టే మిగిలి ఉండ‌గా, మోదీ కేబినెట్ లో చేరేందుకు అటు త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిసామి, ఇటు మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం వ‌ర్గాలు స‌రేన‌న్న‌ట్లుగా తెలుస్తోంది. అంటే ద‌క్షిణాదిలో పాగా వేయాల‌న్న మోదీషా ల వ్యూహం స‌క్సెస్ అయిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు