మా అమ్మ‌కు నెహ్రూకు మ‌ధ్య రొమాన్స్ జ‌ర‌గ‌లేదు

మా అమ్మ‌కు నెహ్రూకు మ‌ధ్య రొమాన్స్ జ‌ర‌గ‌లేదు

దేశ ప్ర‌థ‌మ ప్ర‌ధాన‌మంత్రి, భారత చివరి వైస్రాయ్ లూయిస్ మౌంట్‌బాటెన్ భార్య ఎడ్విన్ మౌంట్‌బాటెన్ మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు చెలామ‌ణిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో శృతిమించిన ఆరోప‌ణ‌ల‌ను కూడా చేశారు. అయితే దీనిపై స్వ‌యంగా లేడీ మౌంట్ బాటెన్ కూతురు వివ‌ర‌ణ ఇచ్చింది. తన తల్లి ఎడ్వినా మౌంట్‌బాటెన్, జవహర్‌లాల్ నెహ్రూ మధ్య ప్రేమ, పరస్పర గౌరవమే ఉంది కానీ, వారి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని బ్రిటిష్‌ వైస్రాయ్ మౌంట్‌బాటెన్ కుమార్తె పమేలా హిక్స్‌నీ తెలిపారు. ``వారిది నిగూఢమైన బంధం. శారీరక సంబంధమేదీ వారి మధ్య ఉండే అవకాశమే లేదు`` అని ఆమె చెప్పారు.

2012లో పమేలా హిక్స్‌నీ మౌంట్‌బాటెన్ రాసిన ``డాటర్ ఆఫ్ ఎంపైర్ : లైఫ్ యాజ్ ఏ మౌంట్‌బాటెన్`` పుస్తకం తాజాగా భారత్‌లో విడుదలైంది. హాశెటె సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఆ పుస్తకంలో నెహ్రూ, వైస్రాయ్ మౌంట్‌బాటెన్ భార్య ఎడ్విన్ మధ్య ఉన్న బంధంపై పలు కోణాలను పమేలా స్పృశించింది. శక్తి, జ్ఞానం సమపాళ్లలో కల లక్షణాన్ని, సాహచర్యాన్ని పండిట్‌జీలో తన తల్లి చూసిందని తెలిపారు. ``నెహ్రూ ఆలోచనలు, వారి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు చూశాక. వారెంత గాఢమైన, గంభీరమైన ప్రేమలో ఉన్నారనేది అర్థమైంది. తొలుత నేను కూడా వారిది శారీరక బంధమేనని భావించాను. కానీ అది తప్పని తర్వాత తెలిసింది. ప్రజాజీవితంలో ఉన్న వారికి ఏకాంత సమయం దొరికే అవకాశమే లేదని వైస్రాయ్ వద్ద ఏడీసీగా పనిచేసిన ఫ్రెడ్డీ బర్నబే కూడా ధ్రువీకరించారు`` పమేలా చెప్పారు.

``భారత్‌ను విడిచిపెడ్తున్నప్పుడు నెహ్రూకు ఎమరాల్డ్ ఉంగరాన్ని ఇవ్వాలని తన తల్లి ఎడ్వినా భావించిందని.. కానీ నెహ్రూ అందుకు అంగీకరించరని.. ఆయన కుమార్తె ఇందిరకు బహూకరించారు.ఆర్థిక ఇబ్బందులొస్తే ఆ ఉంగరాన్ని పండిట్‌జీకి ఇవ్వాలని ఇందిరకు సూచించారు`` అని పమేలా పుస్తకంలో రాశారు. మౌంట్‌బాటెన్ వీడ్కోలు కార్యక్రమంలో నెహ్రూ మాటల్ని పమేలా ప్రస్తావించారు. మీరు ఎక్కడికెళ్లినా ఒక ఉపశమనాన్ని, నమ్మకాన్ని, ప్రోత్సాహాన్ని వెంట తీసుకెళ్తారు. అందుకే భారత ప్రజలు మిమ్మల్ని తమలో ఒకరిగా చూశారు. మీరు వెళ్లిపోతుంటే బాధపడటంలో ఆశ్చర్యమేముంది? అని నేరుగా ఎడ్వినాను ఉద్దేశించి నెహ్రూ మాట్లాడారని పమేలా తన పుస్తకంలో తెలిపారు.