‘అర్జున్ రెడ్డి’కి మోక్షం లభించింది

‘అర్జున్ రెడ్డి’కి మోక్షం లభించింది

‘పెళ్లిచూపులు’ సినిమాతో మాంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అంతకుముందే ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో ఆకట్టుకున్నప్పటికీ.. అతడి పేరు జనాల్లో రిజిస్టరవ్వలేదు. కానీ ‘పెళ్లిచూపులు’ సినిమా అతణ్ని రాత్రికి రాత్రే చిన్న స్థాయి స్టార్ గా మార్చేసింది. ఆ సినిమా తర్వాత దాదాపు అరడజను సినిమాలు అతడి ఖాతాలో చేరాయి. ఐతే ‘పెళ్లిచూపులు’ విడుదలకు ముందే విజయ్ ఓకే చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి’.  ఈ చిత్ర టీజర్ కొన్ని నెలల కిందట రిలీజై సంచలనం సృష్టించింది. స్టన్నింగ్ గా అనిపించిన ఈ టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ తరం యూత్ ‘అర్జున్ రెడ్డి’ టీజర్ తో భలే కనెక్టయ్యారు. సోషల్ మీడియాలో ఈ టీజర్ చర్చనీయాంశమైంది.

ఐతే టీజర్ రిలీజైనపుడు వచ్చిన బజ్ ను ‘అర్జున్ రెడ్డి’ టీం వాడుకుని త్వరగా సినిమాను విడుదలకు సిద్ధం చేసి ఉంటే ఈ సినిమాకు మంచి క్రేజీ్ వచ్చేది. బిజినెస్ కూడా బాగా జరిగేది. కానీ బాగా లేట్ చేశారు. దీంతో జనాలు ఈ సినిమాను మరిచిపోయే పరిస్థితి వచ్చింది. ఈ మధ్యే ఏషియన్ సినిమాస్ సంస్థ హోల్ సేల్ గా రూ.5.5 కోట్లకు ఈ చిత్ర హక్కుల్ని సొంతం చేసుకుంది.

ఈ వార్త బయటికొచ్చిన రెండు రోజులకే ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఆగస్టు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందట. అదే రోజుకు నారా రోహిత్ సినిమా ‘కథలో రాజకుమారి’ షెడ్యూల్ అయి ఉంది. నాగచైతన్య సినిమా ‘యుద్ధం శరణం’ను కూడా అదే రోజుకు అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ‘అర్జున్ రెడ్డి’ ఈ పోటీని తట్టుకోగలడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు