మిథాలీ రాజ్ కు కేసీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్‌!

మిథాలీ రాజ్ కు కేసీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్‌!

మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రిచిన మిథాలీ సేన‌కు దేశవ్యాప్తంగా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. ఫైన‌ల్ లో ఓడిపోయిన్ప‌టికీ దేశ ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకున్న మిథాలీ సేన‌కు స‌ర్వ‌త్రా అభినంద‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే మిథాలీ సేన‌లోని ఆట‌గాళ్లు ఒక్కొక్క‌రికీ బీసీసీఐ రూ.50 ల‌క్ష‌ల న‌జ‌రానా ప్ర‌క‌టించింది. మిథాలీ రాజ్ కు బ‌హుమ‌తిగా బీఎండ‌బ్ల్యూ కారును చాముండీశ్వ‌రీ నాథ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ మిథాలీ రాజ్ కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు.

తాజాగా, మిథాలీరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. మిథాలీకి కోటి రూపాయల నగదు బహుమతి, 600 గజాల నివాస స్థలం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీయిచ్చారు. ఆమెతో పాటు కోచ్‌ మూర్తికి రూ. 25 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను మిథాలీరాజ్‌ కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ శాలువా కప్పి మిథాలీని, కోచ్ ఆర్.ఎస్.ఆర్. మూర్తిని  సన్మానించారు.

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భార‌త‌ జట్టు అద్భుతంగా ఆడిందని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ‘‘ప్రపంచ కప్ పోటీల్లో అద్భుతంగా ఆడారు. ఫైనల్లో కూడా గెలవడం ఖాయం అనుకున్నాం. దురదృష్టవశాత్తు కొద్ది తేడాతో ఓడిపోయాం. దేశమంతా మీకు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా నువ్వు అద్భుత ప్రతిభ కనబరిచి అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించావు. వ్యక్తిగతంగా నా తరుఫున, తెలంగాణ ప్రజల తరుఫున మనసారా అభినందనలు. నీకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని మిథాలీతో ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి మిథాలీ గర్వకారణమ‌ని,  ఆమె భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాల‌ని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు