త్వ‌ర‌లో మ‌రో డీమానిటైజేష‌న్‌?

త్వ‌ర‌లో మ‌రో డీమానిటైజేష‌న్‌?

త్వ‌ర‌లో మ‌రోసారి జ‌నాలు నోట్ల మార్పిడి కోసం క్యూలో ప‌డిగాల్పులు కాయాల్సిందేనా? గ‌త ఏడాది లాగానే మ‌రోమారు కేంద్రం పెద్ద నోట్ల‌ ర‌ద్దు చేపట్ట‌నుందా? ప‌్ర‌స్తుతం ఇటువంటి పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. త్వ‌ర‌లో రూ.2000 నోట్లను కేంద్రం రద్దు చేయ‌నున్నట్లు చాలామంది భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యం బుధ‌వారం పార్ల‌మెంటులో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది.

కొత్త రూ.2000 నోట్లను ప్ర‌భుత్వం రద్దు చేయాలని నిర్ణయించిందా అంటూ విపక్షాలు బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి ప్రశ్నలు సంధించాయి. అయితే, ఈ ప్ర‌శ్న‌కు జైట్లీ స్పందించ‌లేదు. కనీసం రూ.2000 నోట్ల‌ను ర‌ద్దు చేయబోమ‌ని ఓ క్లారిటీ కూడా ఇవ్వలేదు. దీనిని బ‌ట్టి మరోసారి కేంద్రప్రభుత్వం పెద్ద‌నోట్ల రద్దు చేపట్టడానికి సిద్దమవుతుందని వార్త‌లు వినిపిస్తున్నాయి.  
 
ఈ వార్త‌కు బ‌లం చేకూరేలా ఇటీవల రూ.2000 కరెన్సీ నోట్ల సరఫరాను కూడా రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆపి వేసింది. కొత్త రూ.2000 నోట్లు బ్యాంకులకు స‌ర‌ఫ‌రా కావ‌డం లేదు. చలామణిలో ఉన్న నోట్లే బ్యాంకుల‌కు చేరుతున్నాయ‌ని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీనికితోడు రూ.2000 నోట్ల ప్రింటింగ్‌ను ఐదు నెలల క్రితం ఆర్బీఐ ఆపివేసిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. అంతేకాకుండా, త్వ‌ర‌లో కొత్తగా రూ.200 నోట్లను ఆర్బీఐ ప్ర‌వేశ‌బెట్ట‌బోతోంద‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామాల‌న్నీ మ‌రోసారి డిమానిటైజేష‌న్ కు సంకేతాలేన‌ని నిపుణులు భావిస్తున్నారు.
 
రూ.200 నోట్లను చలామణిలోకి తెస్తుండటంతో పాటు, కొత్త రూ.500 నోట్లు మార్కెట్‌లో లభ్యమవుతుండటంతో రూ.2000 నోట్లు రద్దు చేసిన అంత పెద్ద ప్రభావమేమీ ఉండదని తెలుస్తోంది. అయితే, బ్లాక్‌మనీ రూపంలో రూ.2000 నోట్లను కలిగి ఉన్నవారికే తిప్ప‌లు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. నవంబర్‌ నెల మొదట్లో ప్రభుత్వం హఠాత్తుగారూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.  కొత్తగా రూ.2000 నోట్లను ఆర్బీఐ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దీంతో చిన్న నోట్ల కొర‌త‌ ఏర్పడింది. ఆ కొర‌త‌ తీర్చడానికి ఆర్బీఐ కొత్త రూ.200 నోట్లు తీసుకొస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు