డ్ర‌గ్స్ కేసులో కెల్విన్ కు సంబంధం లేద‌ట‌....

డ్ర‌గ్స్ కేసులో కెల్విన్ కు సంబంధం లేద‌ట‌....

హైద‌రాబాద్ డ్ర‌గ్స్ రాకెట్ లో ప్ర‌ధాన సూత్ర‌ధారి కెల్విన్‌. స్కూల్ పిల్ల‌ల నుంచి సినీ సెల‌బ్రిటీల వ‌రకు చాలా మందికి సుప‌రిచితుడు. అత‌డి ఫోన్ లో ఉన్న స‌మాచారం ఆధారంగానే డ్ర‌గ్స్ రాకెట్ గుట్టుర‌ట్టయింది. త‌న కొడుకు డ్ర‌గ్స్ కు బానిస అని, కెల్విన్ వెన‌కు ఉన్న బ‌డాబాబులు వేరే ఉన్నార‌ని సాక్ష్యాత్తు కెల్విన్ తండ్రి జ‌వ‌హ‌ర్ మీడియాకు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అత‌డికి అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ ముఠాల‌తో సంబంధం ఉన్న‌ట్లు కొన్ని చానెళ్ల‌లో వార్త‌లు ప్ర‌సార‌మ‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో కెల్విన్ హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నార‌ని అత‌డి త‌ర‌పు న్యాయ‌వాది రేవంత్ రావు చేసిన‌ ఆరోప‌ణ‌లు ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్నాయి. అస‌లు డ్ర‌గ్స్ కేసుతో కెల్విన్ కు ఎటువంటి సంబంధం లేద‌ని ఆయ‌న తెలిపారు. కెల్విన్‌ అమాయకుడని, అతడు డ్రగ్స్‌ అమ్ముతున్నాడన్నమాట అవాస్తమని రేవంత్ రావు అన్నారు. దీనికి సంబంధించి ఎవరి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవ‌న్నారు. ఒక‌వేళ ‘సిట్‌’ దగ్గర ఆధారాలుంటే కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని సూచించారు. సిట్‌ విచారణ పద్ధతి ప్రకారం జరగడం లేదని, దర్యాప్తు స‌రిగా సాగ‌డం లేద‌ని ఆరోపించారు.

సినిమా వాళ్లకు డ్ర‌గ్స్ అమ్మినట్టు కెల్విన్‌ సమాచారం ఇచ్చాడని వచ్చిన వార్తలను రేవంత్ రావు తోసిపుచ్చారు. కెల్విన్‌ సమాచారం ఇచ్చాడన్నది అబద్దమని, ఇవన్నీ పోలీసులు సృష్టించినవేనని తెలిపారు. దీనిపై అకున్‌ సబర్వాల్ బృందం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కెల్విన్‌ను కలవనీయడం లేదని, తల్లిదండ్రులు కూడా చూసేందుకు అనుమతించడం లేదని చెప్పారు. ఆరోపణ‌లు చేస్తే సంకెళ్లు వేసేస్తారా, అతడి హక్కులను కాలరాస్తారా అని ప్రశ్నించారు. అతడితో సంబంధాలున్నాయని ఎవరు ఒప్పుకున్నారో వెల్లడించాలని రేవంత్ రావు డిమాండ్‌ చేశారు.
కెల్విన్‌పై మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ఆయ‌న అన్నారు.