కమల్ మామూలు ఫిట్టింగ్ పెట్టలేదుగా..

కమల్ మామూలు ఫిట్టింగ్ పెట్టలేదుగా..

లోకనాయకుడు కమల్ హాసన్ గత కొన్ని నెలలుగా చేస్తున్న ట్వీట్లు.. వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన రాజకీయాల్లోకి వస్తాడేమో అన్న సందేహాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొందరు ఆయన్ని ఈ విషయమై గట్టిగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా తమ ప్రభుత్వంపై కమల్ అవినీతి ఆరోపణలు.. విమర్శలు గుప్పించిన నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఓ మంత్రి.. దమ్ముంటే రాజకీయాల్లోకి రా అంటూ సవాలు విసిరాడు. దీనికి సమాధానం ఇస్తూ కమల్ జారీ చేసిన ప్రకటన ఇప్పుడు తమిళనాట ప్రకంపనలు రేపుతోంది. కమల్ తాజాగా ఇచ్చిన ఓ లెంగ్తీ ప్రెస్ నోట్లో..
‘‘ఓ నాయకుడు నన్ను రాజకీయాల్లోకి రమ్మంటూ సవాలు విసిరాడు. కానీ నేను ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టేసిన సంగతి గుర్తించట్లేదు’’ అని పేర్కొనడం విశేషం. కమల్ ఏ సెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు అర్థం కాక తమిళ జనాలు తలలు పట్టుకుంటున్నారు.

ఆ వ్యాఖ్యల మాట పక్కన పెడితే.. తన లేటెస్ట్ ప్రెస్ నోట్లో కమల్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఫిట్టింగ్ పెట్టాడు. కమల్ చేసిన అవినీతి ఆరోపణలపై తమిళనాడు ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ తాము అవినీతికి పాల్పడ్డామన్నదానికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. దీనిపై కమల్ స్పందిస్తూ.. తమిళనాడు మంత్రులు అవినీతికి పాల్పడ్డారనే విషయంలో మీ దగ్గరున్న ఆధారాలు సమర్పించమంటూ తన అభిమానులకు.. జనాలకు పిలుపునిచ్చాడు.

ఏదో మాట వరసకు ఆరోపణలు చేయడం.. పేపర్లు సమర్పించడం కాకుండా.. అవినీతిని రుజువు చేసే సాంకేతిక ఆధారాలు ఉండాలని.. వీడియోలు, ఫొటోలు ఏవైనా సరే.. ఇక్కడ అప్ లోడ్ చేయండి అంటూ ఒక వెబ్ సైట్ లింక్ ఇచ్చాడు. తానున్న సినీ పరిశ్రమలోనూ అవినీతి జరుగుతోందని.. సినిమాలకు ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ తెచ్చుకుని పన్ను మినహాయింపు పొందేందుకు ఇండస్ట్రీలో చాలామంది లంచాలిస్తారని.. తనలాంటి కొందరు మాత్రమే ఇందుకు మినహాయింపు అని.. తాను తన పరిశ్రమకు సంబంధించి ఈ వివరాలు చెబుతున్నా కాబట్టి.. మీరు కూడా ఆయా రంగాలకు సంబంధించిన అవినీతి గురించి గళం విప్పండి. వివరాలు సమర్పించండి అంటూ కమల్ పిలుపునిచ్చాడు. కమల్ పిలుపుతో జనాలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English