త‌మిళ ఎమ్మెల్యేల వేత‌నాలు రెట్టింప‌య్యాయే!

త‌మిళ ఎమ్మెల్యేల వేత‌నాలు రెట్టింప‌య్యాయే!

దేశంలో ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నిక‌వుతున్న నేతాశ్రీల‌కు వేత‌నాలు ఇబ్బ‌డిముబ్బడిగా పెరుగుతున్నాయి. గ‌డ‌చిన మూడేళ్ల కాలంలో దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్రతినిధుల వేత‌నాలు పెరిగాయి. అప్ప‌టిదాకా అందుకుంటున్న వేత‌నాలు త‌మ‌కు ఏమాత్రం స‌రిపోవ‌ని ప్ర‌జా ప్ర‌తినిధులు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు నివేదించ‌డం, వెనువెంట‌నే ఆయా ప్ర‌భుత్వాలు కూడా ఆ ప్ర‌తిపాదన‌ల‌కు ఓకే అనడం, వెనువెంట‌నే వేత‌నాలు పెరిగిపోవ‌డం జ‌రిగిపోతోంది.

తొలుత ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ స‌ర్కారు ఎమ్మెల్యేల వేత‌నాల పెంపున‌కు శ్రీకారం చుట్టింది. ఆ త‌ర్వాత దేశంలో కొత్త రాష్ట్రంగా ప్ర‌స్థానం ప్రారంభించిన తెలంగాణ‌లో ఆ రాష్ట్ర సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు... త‌న రాష్ట్రంలోని ఎమ్మెల్యేల‌తో పాటు స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు కూడా వేత‌నాల‌ను భారీగా పెంచేశారు. ఈ పెంపుద‌ల రెట్టింపు కంటే కూడా అధికంగా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక అప్పుల్లో ఉన్న న‌వ్యాంధ్ర‌లోనూ ఎమ్మెల్యేల వేత‌నాలు, అల‌వెన్సులు కూడా పెరిగిపోయాయి.

తాజాగా త‌మిళ‌నాడు వంతు వ‌చ్చేసింది. త‌మిళ తంబీలు అమ్మ‌గా పిలుచుకునే దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం ఆ రాష్ట్రంలో రాజ‌కీయ శూన్యం ఆవ‌రించింది. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత తొలుత ప‌న్నీర్ సెల్వం సీఎం కుర్చీ ఎక్క‌గా, తాజాగా ఆ స్థానాన్ని జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ‌కు న‌మ్మిన‌బంటుగా ఉన్న ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి ఇప్పుడు సీఎంగా ఉన్నారు. త‌మిళ‌నాట రాజ‌కీయం రోజుకో మ‌లుపు తిరుగుతున్న నేప‌థ్యంలో అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ... ప‌ళ‌నిస్వామి త‌న రాష్ట్ర ఎమ్మెల్యేల వేత‌నాల‌ను డ‌బుల్ చేస్తూ కాసేప‌టి క్రితం కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇప్ప‌టిదాకా త‌మిళ‌నాడులో ఒక్కో ఎమ్మెల్యేకు నెల‌వారీ రూ.55 వేలు అందుతున్నాయి. దీనికి ఇత‌ర అల‌వెన్సులు అద‌నం.

ఈ వేత‌నాన్ని ఒకేసారి రూ.1.20 ల‌క్ష‌ల‌కు పెంచుతూ ఓపీఎస్ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అంటే సింగిల్ దెబ్బ‌కు ఎమ్మెల్యేల వేత‌నాలు డ‌బుల్ కంటే కూడా ఎక్కువ‌గా పెరిగిపోయాయ‌న్న మాట‌. ఇక ఇత‌ర అల‌వెన్సుల‌ను కూడా పెంచుతూ స‌ద‌రు ఉత్త‌ర్వుల్లో ఓపీఎస్ సర్కారు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే నిజ‌మైతే... త‌మిళ‌నాడు ఎమ్మెల్యేల‌కు ఇప్పుడు అందుతున్న వేత‌నాల కంటే కూడా ఇక‌పై త్రిబుల్ శాల‌రీలు ఖాయ‌మేన‌న్న మాట‌. ఓ వైపు రుణాల‌ను మాఫీ చేయాలంటూ త‌మిళ నాడు రైతులు ఢిల్లీ వీధుల్లో క‌దం తొక్కుతున్న నేప‌థ్యంలో ఓపీఎస్ స‌ర్కారు... ఎమ్మెల్యేల వేత‌నాల‌ను రెట్టింపు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంపై పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు