నేను కాదు...పెళ్లి కాని రాహుల్ బ‌చ్చా

నేను కాదు...పెళ్లి కాని రాహుల్ బ‌చ్చా

విప‌క్షాల‌ను, విప‌క్ష నాయ‌కుల‌ను విమ‌ర్శించ‌డంలో, తన‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు దీటైన జ‌వాబివ్వ‌డంలో కేసీఆర్ దిట్ట‌. ఆయ‌న కొడుకు కేటీఆర్ కూడా తండ్రి బాట‌లోనే ప‌య‌నిస్తున్నారు. త‌న తండ్రి కేసీఆర్ త‌ర‌హాలోనే విప‌క్షాలపై విరుచుకుప‌డుతున్నారు. త‌న‌పై ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన‌ వ్యాఖ్య‌ల‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కౌంట‌ర్ ఇచ్చారు. పెళ్లి కాని రాహుల్ బచ్చా కాదా? అని ప్రశ్నించారు.  తెలంగాణ భవన్‌లో జ‌రిగిన తెరాస విద్యార్థి విభాగం సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

‘కేటీఆర్ నువ్వో బచ్చా... కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి నీకు లేదు. నోరు అదుపులో పెట్టుకో..’ అని కేటీర్ ను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌కు కేటీఆర్ దీటుగా బ‌దులిచ్చారు. తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్ర‌భుత్వం చేసే ప్ర‌తి ప‌నికి కాంగ్రెస్ అడ్డుప‌డుతోంద‌న్నారు. కొంత‌మంది తనను బచ్చా అంటున్నార‌ని, తనకు పెళ్లి అయిందని, పెళ్లి కాని రాహుల్ బచ్చా కాదా? అని ప్రశ్నించారు.

తెలంగాణ‌లో భగీరథకు 40వేల కోట్లు రూపాయలు ఎందుకని కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగుతున్నార‌న్నారు. ఆనాడు చిత్తూరు జిల్లాకు మంచినీటి కోసం 9వేల కోట్ల ఖర్చు అయితే తెలంగాణ మొత్తానికి 40వేల కోట్లు ఖర్చు కావా? అని ప్ర‌శ్నించారు. విద్యార్థులే భ‌విష్య‌త్ నాయ‌కుల‌వ్వాల‌ని సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని కేటీఆర్ అన్నారు. విద్యార్థులు ప్రగతి సైన్యంగా తయారు కావాలని సీఎం కోరుకుంటున్నట్లు చెప్పారు. జ్ఞానం కోసం చదువు...ప్రజల కోసం నడువు అన్న‌ది కేసీఆర్ విధానమని కేటీఆర్‌ తెలిపారు. విద్యార్థుల త్యాగాలు, ప్రజా పోరాటాల ద్వారానే తెలంగాణను సాధించుకున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వాల్సిన అనివార్యతను కల్పించామని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు