చిన్న‌మ్మ కేరాఫ్ అడ్ర‌స్ ఛేంజ్‌?

చిన్న‌మ్మ కేరాఫ్ అడ్ర‌స్ ఛేంజ్‌?

అక్ర‌మాస్తుల కేసులో జైలుశిక్ష అనుభ‌విస్తున్న చిన్న‌మ్మ అలియాస్ శ‌శిక‌ళకు మ‌రో ఊహించ‌ని షాక్ త‌గ‌ల‌నుంది. క‌ర్ణాట‌క‌లోని ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైల్లో శిక్ష అను భ‌విస్తున్న చిన్న‌మ్మ‌కు.. జైలు రాజ‌ప్రసాదంగా మారిపోయింద‌న్న ఆరోప‌ణ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టికి మొన్న విజ‌య‌శాంతి మొద‌లుకొని ప‌లువురు వేళ కాని వేళ‌లో చిన్న‌మ్మ‌ను క‌లిసి రావ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ఇవి స‌రిపోన‌ట్లుగా.. ఆమె కోసం ఏకంగా ఒక కిచ‌న్ ఏర్పాటు చేసిన‌ట్లుగా ఆరోపించారు జైళ్ల‌శాఖ డీఐజీ రూప‌. ఈ మేర‌కు ఆమె త‌న నివేదిక‌లో సంచ‌ల‌న వ్యాఖలు చేశారు. శ‌శిక‌ళ‌కు జైల్లో స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసిన‌ట్లుగా పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. చిన్న‌మ్మ‌కు స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు వీలుగా జైళ్ల శాఖ డీజీపీ హెచ్ఎన్ స‌త్య‌నారాయ‌ణ‌రావుకు రూ.2కోట్ల మేర ముడుపులు అందిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. అయితే.. అలాంటిదేమీ లేద‌న్న ఖండ‌న‌లు వ‌చ్చినా.. చిన్న‌మ్మ సౌక‌ర్యాల‌పై క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఇప్పుడు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. దీనికి తోడు.. రాజ‌కీయ అంశాలు తోడు కావ‌టంతో ఈ మొత్తం వ్య‌వ‌హారం మీద క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేశారు.

అయితే.. ఈ వివాదం ఇక్క‌డితో స‌మిసిపోలేదు. తాను చేసిన ఆరోప‌ణ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లుగా చెప్పిన డీఐజీ రూప.. గురువారం మీడియాతో మాట్లాడారు.  త‌న నివేదిక‌లో పేర్కొన్న ప్ర‌తి ఒక్క అంశం వాస్త‌వ‌మేన‌ని.. అందులోని ప్ర‌తి అంశానికి తాను క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లుగా పేర్కొన్నారు. త‌న‌పై ఎవ‌రి ఒత్తిడి లేద‌ని తేల్చిన ఆమె.. విచార‌ణ‌లో అన్ని అంశాలు వెలుగు చూస్తాయ‌న్నారు. అయితే.. రూప వ్యాఖ్య‌ల‌ను డీజీపీ కొట్టిపారేశారు. ఈ మొత్తం వివాదం అంత‌కంత‌కూ ముదిరి పాకాన ప‌డుతున్న వేళ‌లో క‌ర్ణాట‌క స‌ర్కారు అనూహ్య నిర్ణ‌యాన్ని తీసుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు. వివాదానికి కార‌ణ‌మైన ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైలు నుంచి చిన్న‌మ్మ‌ను త‌ర‌లించి.. మ‌రో జైలుకు మారిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అదే జ‌రిగితే.. చిన్న‌మ్మ‌కు గ‌డ్డు రోజులు ఎదురైన‌ట్లేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు