తాజా రిపోర్ట్‌: చైనా తాట మ‌నం తీసేయ‌గ‌ల‌మ‌ట‌

తాజా రిపోర్ట్‌: చైనా  తాట మ‌నం తీసేయ‌గ‌ల‌మ‌ట‌

చైనా అన్న వెంట‌నే డ్రాగ‌న్ గుర్తుకు వస్తుంది. ఆ వెంట‌నే దూకుడు కాస్త త‌గ్గుతుంది. ఎందుకంటే.. చైనా మ‌న‌కంటే పే..ద్ద‌ద‌న్న ఫీలింగ్ చాలామంది భార‌తీయుల‌కు ఉంది. ఎంత పెద్ద శ‌త్రువైనా.. దానికుండే బ‌ల‌హీన‌త‌లు దానికీ ఉంటాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోతారు.  
దేశ ప్ర‌జ‌లు చైనా విష‌యంలో ఇలా ఆలోచించ‌టానికి పాల‌కుల త‌ప్పులు కూడా లేక‌పోలేవు. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి అధికారాన్ని చేతిలో ఉంచుకున్న పార్టీలేవీ దూర‌దృష్టితో వ్య‌వ‌హ‌రించ‌లేద‌న‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అదే ఇప్పుడు శాపంగా మారింది. మ‌న‌కు మ‌నం శ‌క్తివంతుల‌మే అయినా.. ఆ విష‌యం దేశ ప్ర‌జ‌ల‌కు తెలీని దుస్థితి.

ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. భార‌త్ శ‌క్తి సామ‌ర్థ్యాల గురించి అమెరికాకు చెందిన ప్ర‌ముఖ అణ్వాయుధ నిపుణులు రాసిన క‌థనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. భార‌త్ శ‌క్తి సామ‌ర్థ్యాల గురించి వారు వివ‌రించ‌ట‌మే కాదు.. మ‌న‌మెంత శ‌క్తివంతుల‌మ‌న్న విష‌యాన్ని.. చైనా తాట తీసే స‌త్తా మ‌న‌కెంత ఉంద‌న్న వివ‌రాల్ని వివ‌రంగా వెల్ల‌డించారు.

భార‌త్ త‌న అణ్వాయుధ సంప‌త్తిని ఆధునీక‌రిస్తోంద‌ని.. చైనా మొత్తాన్ని టార్గెట్ చేసేంత క్షిప‌ణుల‌ను త‌యారు చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంద‌న్నారు. సాధార‌ణంగా భార‌త్ త‌న అణు వ్యూహాల‌ను పాక్ పై దృష్టి పెడుతుంద‌ని.. తాజా ప‌రిస్థితుల్లో చైనాపై త‌న వ్యూహాల‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంద‌న్న విష‌యాన్ని స‌ద‌రు రిపోర్ట్ లో పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

ఈ వివరాల‌న్నింటిని అమెరికాకు చెందిన హాన్స్ ఎం క్రిస్టెన్స‌న్‌.. రాబ‌ర్ట్ ఎస్ నోరిస్ అనే ఇద్ద‌రు అణ్వాయుధ నిపుణులు త‌మ ఇండియ‌న్ న్యూక్లియ‌ర్ ఫోర్స్ 2017 పేరిట రాసిన క‌థ‌నంలో పేర్కొన్నారు.

భార‌త్ ద‌గ్గ‌ర ప్ర‌స్తుతం ఏడు అణు సామ‌ర్థ్య వ్య‌వ‌స్థ‌లు ఉన్నాయ‌ని.. అందులో రెండు ఎయిర్ క్రాఫ్ట్ లు.. నాలుగు భూ ఉప‌రిత‌ల ఖండాంత‌ర క్షిప‌ణులు.. ఒక‌టి స‌ముద్ర ఉప‌రిత‌ల ఖండాంత‌ర క్షిప‌ణి ఉంద‌ని.. మ‌రో నాలుగు వ్య‌వ‌స్థ‌ల్ని అభివృద్ధి చేస్తోంద‌ని పేర్కొన్నారు.

అగ్ని 1ను ఆధునీక‌రించి రూపొందించిన అగ్ని 2కు రెండు వేల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించే సామ‌ర్థ్యం ఉంద‌ని.. అంటే ఈ క్షిప‌ణితో చైనాలోని ప‌శ్చిమ‌.. ద‌క్షిణ‌.. మ‌ధ్య భూభాగాల‌ను ల‌క్ష్యం చేసుకునే వీలుంద‌న్నారు. అగ్ని 4ను ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్ర‌యోగిస్తే.. చైనా మొత్తాన్ని టార్గెట్ చేసే వీలుంద‌ని చెబుతున్నారు. ఐదు వేల కిలోమీట‌ర్లకు పైగా ప్ర‌యాణించే సామ‌ర్థ్యం ఉన్న ఖండాంత‌ర క్షిప‌ణిని ద‌క్షిణాది నుంచి ప్ర‌యోగించినా చైనా మొత్తాన్ని టార్గెట్ చేసేసే వీలుంద‌ని చెప్పారు. వీరి మాట‌లు విన్న‌ప్పుడు భార‌త్ 1962 నాటిది ఎంత మాత్రం కాద‌న్న విష‌యం మ‌రింత స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు