లాక్ డౌన్ హోటల్ తెరిచిన ఆ నటుడు

కరోనా మహమ్మారి అన్ని రంగాలనూ అతలాకుతలం చేస్తోంది. సినీ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ రంగంలో అవస్థలు పడుతున్న కార్మికులను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల్లోనూ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇతర రంగాల్లో కష్టాలు పడుతున్న వారికి కూడా సిినీ జనాలు సాయం చేస్తున్నారు.

తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇప్పటికే సినీ కార్మికుల కోసం సహాయ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడతను మరో మంచి పనికి ముందుకొచ్చాడు. సోనూకు ముంబయిలోని జుహు ప్రాంతంలో పెద్ద హోటల్ ఉంది. లాక్ డౌన్ కారణంగా అది మూతపడింది. ఐతే ఇంకా లాక్ డౌన్ ఎత్తేయకముందే సోనూ ఆ ఆసుపత్రిని తెరుస్తున్నాడు. ఐతే ఇలాంటి సమయంలో హోటల్ మళ్లీ తెరవడం వెనుక ో మంచి కారణం ఉంది.

ఈ అత్యవసర పరిస్థితుల్లో సమయం చూసుకోకుండా పని చేస్తున్న హెల్త్ వర్కర్లకు తోడ్పాటు అందించడానికే సోనూ సూద్ తన హోటల్‌ను మళ్లీ తెరుస్తున్నాడు. ఇందుకోసం అతను ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా తీసుకున్నాడు. వైద్య సిబ్బందికి  ఉచితంగా భోజనం పెట్టబోతున్నాడు సోనూ.

‘‘ఈ కష్ట కాలంలో మన జాతీయ హీరోలకు అండగా నిలవాల్సిన అవసరముంది. రోజు మొత్తం విరామం లేకుండా కష్టపడుతున్న హెల్త్ వర్కర్ల కోసం జుహులోని నా హోటల్‌ను తెరుస్తున్నా. వాళ్లు పడుతున్న అసాధారణ కష్టానికి మనం చేయగలిగే చిన్న సాయం ఇది. జైహింద్’’ అంటూ సోనూ ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టాడు.

మరోవైపు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వేలమందికి భోజన ఏర్పాట్లు చేస్తుండగా.. సల్మాన్ ఖాన్ 25 వేల మంది కార్మికుల అకౌంట్లలోకి పరిస్థితులు మెరుగు పడే వరకు నెలవారీగా డబ్బులు వేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా మరిందరు బాలీవుడ్ తారలు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారు.