జ‌గ‌న్ బాబాయి సంగ‌తి ఆ ద‌ర్యాప్తుతో తేలిపోతుంది

జ‌గ‌న్ బాబాయి సంగ‌తి ఆ ద‌ర్యాప్తుతో తేలిపోతుంది

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ఆర్సీపీ నిర్వ‌హించిన ప్లీనరీపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. జగన్ పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తూ, సీఎం సీటు ...సీటు అంటూ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.  ప్రభుత్వంపై మిడి మిడి జ్ఞానంతో ఆరోపణలు చెయ్యడం సరికాదన్నారు. రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి కూడా జగన్ అబద్ధాలు మాట్లాడారన్నారు. రైతులు, మహిళల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలనలో పదేళ్లలో ఎంతమేర వెచ్చించారు...తమ మూడేళ్ల పాలనలో ఎంత ఖర్చు చేశాం? అనేదానిపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి సోమిరెడ్డి  చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసిరారు. సచివాలయంలో  నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీని టార్గెట్ గా చేసుకుని నిర్వహించిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీ ప్రయోగం వికటించిందన్నారు. ఇప్పటికైనా జగన్ వాస్తవాలు మాట్లాడితే, ప్రజలు హర్షిస్తారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు.

అసెంబ్లీలో జరిగిన ఎన్నో చర్చల్లో పాల్గొన్న ప్రతిపక్ష నాయకుడు జగన్... ప్లీనరీలో మాత్రం ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేశారని సోమిరెడ్డి మండిప‌డ్డారు. ఇది ఆయన అవివేకానికి, అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. తనపై వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకోడానికి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్నా తమ ప్రభుత్వం రైతులు, మహిళల సంక్షేమానికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందన్నారు. వైఎస్ సహా కాంగ్రెస్ పదేళ్ల పాలనలో రూ. 66,234 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలో రూ. 1,93,500 కోట్లు పెట్టామన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ మరో రూ.87 వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నామన్నారు. ఇలా మొత్తం నాలుగేళ్ల కాలంలో రూ.2,80,900 కోట్లను రైతులు, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు.ఈ విషయాలన్నీ తెలిసీ కూడా జగన్ అబద్ధాలు మాట్లాడుతూ, ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి దుయ్యబట్టారు. రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ సాధ్యం కాదన్న జగన్ ఇప్పుడు అదే మంత్రం జపిస్తున్నారన్నారు. రైతులకు రూ.50 వేలు ఒకసారి, ఏడాదికి రూ.12,500లు ఇస్తామని మరోసారి చెబుతూ, పొంతనలేని హామీలు ఇస్తున్నారన్నారు.  రైతులు, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం  చేస్తున్న కృషిపైనా, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణపైనా జగన్ గాని, ఆయన పార్టీ నేతలుగాని చర్చకు రావాలని మంత్రి సోమిరెడ్డి సవాల్ విసిరారు.

దేశంలోనే మొదటిసారి రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సోమిరెడ్డి అన్నారు. 26 లక్షల రైతులకు మేలు కలిగేలా ఒకే ఒక్క సంతకంతో రూ.50 వేల రుణాలు మాఫీ చేశామన్నారు. ఒక్కో రైతుకు లక్షన్నర రూపాయలు మాఫీ చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం లక్ష రూపాయలు మాత్రమే మాఫీ చేసిందన్నారు. మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు రైతు రుణమాఫీలు చేస్తున్నాయన్నారు. ఇలా దేశంలో మిగిలిన రాష్ట్రాలకు తమ ప్రభుత్వం రుణమాఫీలో రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. బ్యాంకులు రైతుల నుంచి 18 శాతం మేర అపరాధ రుసుం వసూలు చేస్తున్నాయని జగన్ అంటున్నారని, ఇది చాలా దారుణమని అన్నారు. రైతుల నుంచి 18 శాతం మేర అపరాధ రుసుం బ్యాంకులు వసూలు చేసిన ఘటనలు ఎక్కడా లేవన్నారు. ఎక్కడయినా ఇటువంటి ఘటన జరిగి ఉంటే, తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. రాష్ర్టంలో రైతులకు లక్ష రూపాయల వరకూ ఎటువంటి వడ్డీ లేకుండా రుణాలిస్తున్నామన్నారు. జాతీయ ఉపాధి హమీ పథకం నిధుల వినియోగంలోని ఏపీ అగ్రగామిగా నిలించిందన్నారు. ఈ నిధులతో టీడీపీ, వైఎస్ఆర్ సిపి సర్పంచులున్న గ్రామాల్లోనూ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

సీఎం సీటుపై ఉన్న కోరికతోనే జగన్ దశలవారీగా మద్యపానం నిషేధం చేస్తామంటున్నారని మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా దశలవారీగా మద్యపానంపై నిషేధం విధిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, గెలిచిన తరవాత ఆ ఊసే ఎత్తలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేశారు. విశాఖ భూ అక్రమాలపై సిట్ దర్యాప్తు జరుగుతోందన్నారు. వైఎస్ హయాంలోనూ చేపట్టిన భూ కేటాయింపుల్లో చోటు చేసుకున్న అక్రమాలపైనా సిట్ దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ దర్యాప్తులో జగన్ బాబాయ్, ఎంపీ వైవి సుబ్బారెడ్డికి విశాఖలోని మధురవాడ భూ కేటాయింపుల గుట్టు రట్టవుతుందన్నారు. పోలవరం సహా మిగిలిన సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పనులు ఇంకా బాగా జరగాలని చెబితే తప్పులేదుగాని, అసలు జరగేలేదని అనడం సరికాదన్నారు. రాజధానిలో లక్ష కోట్ల రూపాయల మేర అవినీతి జరగిందంటూ జగన్ చేసిన ఆరోపణలను మంత్రి సోమిరెడ్డి ఖండించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు