కేసీఆర్‌ను టెంప్ట్ చేసేలా స‌వాల్‌

కేసీఆర్‌ను టెంప్ట్ చేసేలా స‌వాల్‌

రాజ‌కీయాల్లో తెలివి ఎవ‌రి సొత్తు కాదు. కాలం క‌లిసి వ‌స్తే చాలు.. వాన‌పాము కూడా క‌ట్ల పాము అంత ప‌వ‌ర్ ఫుల్ గా మారిపోతుంది. గ‌డిచిన కొన్నేళ్లుగా అంత‌కంత‌కూ ప‌వ‌ర్ ఫుల్ గా త‌యార‌వుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. రాజ‌కీయంగా ఆయ‌న్ను దెబ్బ తీసేలా త‌ర్వాత‌..క‌నీసం మాట‌ల‌తో ఇబ్బంది పెట్టేలా కూడా ఎవ‌రూ మాట్లాడ‌లేని ప‌రిస్థితి.

పేరుకు ప్ర‌తిప‌క్షం ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ మాట‌ల‌తో అధికార‌ప‌క్షానికి చెమ‌ట‌లు ప‌ట్టించే వారు క‌నిపించ‌ని దుస్థితి. ఈ విష‌యాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ త‌న‌దైన శైలిలో చెల‌రేగిపోతున్నారు. ఏపీలో ఇలాంటి ప‌రిస్థితి లేద‌ని చెప్పాలి. అక్క‌డ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ రూపంలో బ‌ల‌మైన ప్ర‌తిపక్షం ఉండ‌టం అక్క‌డి అధికార‌ప‌క్షానికి ఎంత ఇబ్బందిక‌రంగా మారింద‌న్న‌ది ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

జ‌గ‌న్ మాదిరి ప‌వ‌ర్ ఫుల్ ప్ర‌తిప‌క్ష నేత తెలంగాణ‌లో లేక‌పోవ‌టం.. టీఆర్ఎస్ అదృష్టంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ సీనియ‌ర్ కాంగ్రెస్ నేత కోమ‌టి రెడ్డి సంచ‌ల‌న స‌వాలు చేశారు. ఉద్య‌మ స‌మ‌యంలో స‌వాల్ విసిర‌టం ఆల‌స్యం సై అనేసే కేసీఆర్‌.. సీఎం అయ్యాక త‌న తీరును దాదాపుగా మార్చుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. కేసీఆర్  ఇగోను ట‌చ్ చేసే మాట‌ల‌తో తాజాగా స‌వాలు విసిరారు కోమ‌టి రెడ్డి.

త‌ర‌చూ స‌ర్వేలు చేయించే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు నిజంగానే త‌ను చేయించే వాటిపై న‌మ్మ‌కం ఉంటే.. ఇత‌ర పార్టీల నుంచి త‌మ పార్టీలోకి చేర్చుకున్న పాతిక మంది ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించాని స‌వాలు విసిరారు. మొత్తం పాతిక మందిలో క‌నీసం 20 మందిని గెలిపించుకున్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో (2019) పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీతో తాము ప్ర‌త్యేకంగా మాట్లాడి.. పోటీ లేకుండా రెండోసారి కేసీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేస్తామ‌న్నారు. టెంప్ట్ చేసేలా ఉన్న ఈ స‌వాలుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. కోమ‌టి రెడ్డి స‌వాలుకు కేసీఆర్ టెంప్ట్ అయినా కాకున్నా.. ఏదో ఒక‌రోజు భారీ రిటార్ట్ మాత్రం ఇస్తార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు