విమ‌ర్శ‌ల‌తో ప‌వ‌న్ ను ఉతికేసిందిగా!

విమ‌ర్శ‌ల‌తో ప‌వ‌న్ ను ఉతికేసిందిగా!

అస‌లే ఫైర్ బ్రాండ్‌. అందులో ఆమె ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా.. ఆమె రాజ‌కీయ క‌మిట్ మెంట్‌పై సందేహాలు వ్య‌క్తమ‌య్యేలా.. అభిమానుల్లో క‌న్ఫ్యూజ్ క్రియేట్ చేసేలా జ‌రుగుతున్న ప్ర‌చారాల నేప‌థ్యంలో వీట‌న్నింటికి ప‌రోక్షంగా కార‌ణ‌మైన వ్య‌క్తిపై నిప్పులు చెరిగారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా. ఇటీవ‌ల కాలంలో ఆమె జ‌న‌సేన పార్టీలో చేరుతున్న‌ట్లుగా సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున ప్ర‌చారం సాగుతోంది.

జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మంలో త‌న తోటి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించే నాగ‌బాబుతో ఉన్న స్నేహంతో.. ఆయ‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన‌లోకి  రోజా వెళుతున్న‌ట్లుగా అర్థం లేని ప్ర‌చారం ఒక‌టి ఈ మ‌ధ్య‌న మొద‌లైంది. ఇలాంటివి రోజాకు ఇరిటేట్ చేశాయో ఏమో కానీ.. తాజాగా  ఆయ‌న‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అన్యాయం జ‌రిగితే ప్ర‌శ్నిస్తాన‌ని చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎందుకు ప్ర‌శ్నించ‌టం లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు.

ఎన్నిక‌ల వేళ కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు.. మూడేళ్లేగా ఎందుకు ఇవ్వ‌టం లేద‌ని ఆమె నిల‌దీశారు. కాపుల‌ను సీఎం చంద్ర‌బాబు మోసం చేస్తున్నా..ప‌వ‌న్ మాత్రం ప‌ట్టించుకోవ‌టం లేద‌ని త‌ప్పు ప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

"ప్ర‌శ్నిస్తాన‌న్న మొన‌గాడు ఎక్క‌డికి వెళ్లాడు. చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అని చెప్పుకునే పెద్ద మ‌నిషి జీఎస్టీ భారం గురించి ఎందుకు నోరు మెద‌ప‌టం లేదు? ల‌బ్బ‌ర్ సింగో.. గ‌బ్బ‌ర్ సింగో ఆయ‌నే తేల్చుకోవాలి. ప్ర‌జ‌ల శ్రేయ‌స్సే ముఖ్య‌మ‌ని అనుకుంటే ప్ర‌భుత్వాల్ని నిల‌దీయాలి" అంటూ జ‌న‌సేనాధిప‌తిపై తీవ్రంగా మండిప‌డ్డారు.

కొస‌మెరుపు- గ‌త ఎన్నిక‌ల అనంత‌రం కేవ‌లం ప‌వ‌న్ వ‌ల్లే త‌న పార్టీ గెల‌వ‌కుండా, జ‌గ‌న్ సీఎం కాకుండా, తాను మంత్రి కాకుండా పోయాన‌ని ఓ సంద‌ర్భంలో క‌న్నీరు పెట్టుకుందావిడ‌. పాపం ... ఆ కోపం ఇంకా త‌గ్గినట్లు లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు