కమెడియన్ పృథ్వీ నెలకు 8 లక్షలివ్వాలి

కమెడియన్ పృథ్వీ నెలకు 8 లక్షలివ్వాలి

సినీ రంగంలోకి వచ్చే ముందే పెళ్లి చేసుకోవడం.. ఇక్కడొచ్చి మంచి పేరు సంపాదించాక భార్యను దూరం పెట్టి కేసులు కొని తెచ్చుకోవడం.. కోర్టుతో మొట్టికాయలు తినడం.. ఈ కోవలో చాలామందినే చూశాం. తాజాగా కమెడియన్ పృథ్వీరాజ్ కూడా ఈ జాబితాలోకి చేరాడు. పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు రూ.8 లక్షలు భరణంగా చెల్లించాలంటూ విజయవాడ ఫ్యామిలీ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

పోలీసుల కథనం ప్రకారం విజయవాడలోని అరండల్ పేటకు చెందిన శ్రీలక్ష్మి (47)కి నటుడు శేషు అలియస్ మూర్తి అలియాస్ బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు 1984లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు విజయవాడలో మిఠాయి దుకాణం నిర్వహించేవారు. శ్రీలక్ష్మి తండ్రి చనిపోవడంతో ఆమె కొంత కాలం పాటు పృథ్వీరాజ్‌తో కలిసి ఆ దుకాణం చూసుకుంది. అదే సమయంలో నటనపై ఆసక్తి తో పృథ్వీరాజ్ తరచూ చెన్నై వెళ్లి వస్తుండేవాడు. క్రమంగా సినిమా రంగంలో అవకాశాలు పెరగడంతో కాపురాన్ని హైదరాబాద్‌కు మార్చాడు.

కొన్నేళ్ల తర్వాత పృథ్వీ శ్రీలక్ష్మితో గొడవపడి 2016 ఏప్రిల్ 5న ఆమెను ఇంటి నుంచి పంపేశాడు. దీంతో శ్రీలక్ష్మి విజయవాడ చేరుకుంది. పెద్ద మనుషులు రాజీ చేసే ప్రయత్నం చేసినా కుదర్లేదు. దీంతో 2016 నవంబర్ 2న సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో శ్రీలక్ష్మి.. పృథ్వీపై 498-ఎ కేసు పెట్టింది. తన భర్త ఆదాయ పరిస్థితి బాగున్నందున తన జీవనోపాధికి నెలకు రూ.10 లక్షలు ఇప్పించాలని శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలు చేసింది.

కోర్టు సమన్లను అందుకోకపోవడం.. కేసు వాయిదాకు హాజరు కాకపోవడంతో తాజాగా న్యాయమూర్తి.. రూ.8 లక్షల చొప్పున ప్రతి నెలా శ్రీలక్ష్మికి భరణం చెల్లించాలని పృథ్వీని ఆదేశించారు.  నెలకు రూ.8 లక్షలంటే.. ఏడాదికి రూ.96 లక్షలన్నమాట. మరీ ఆ స్థాయిలో పృథ్వీ భరణం చెల్లించుకుంటాడా.. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తాడా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు