హైకోర్టులో ఏపీ స‌ర్కారుకు దివాక‌ర్ ట్రావెల్స్ షాక్‌!

హైకోర్టులో ఏపీ స‌ర్కారుకు దివాక‌ర్ ట్రావెల్స్ షాక్‌!

ఉమ్మ‌డి హైకోర్టులో ఏపీ అడ్డంగా బుక్ అయ్యింది. దివాక‌ర్ ట్రావెల్స్ కు క్లీన్ చిట్ ఇచ్చిన ఏపీ స‌ర్కారు తీరును హైకోర్టు ప్ర‌శ్నించ‌టంతో పాటు.. అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. మొత్తంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంది. ఇదంతా ఎందుకంటే.. కృష్ణా జిల్లా ముండ్ల‌పాడు వ‌ద్ద ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌మాదానికి గురైన దివాక‌ర్ ట్రావెల్స్ బ‌స్సు రూల్స్‌ను ఉల్లంఘించ‌లేద‌ని ఏపీ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. దివాక‌ర్ ట్రావెల్స్ పై జ‌రుగుతున్న విచార‌ణ‌లో ఏపీ ఇచ్చిన నివేదిక‌కు భిన్నంగా తెలంగాణ అధికారులు నివేదిక ఇవ్వ‌టంతో ఏపీ తీరును హైకోర్టు ప్ర‌శ్నించింది.

ఏపీ స‌ర్కారు దాఖ‌లు చేసిన నివేదిక‌లో ప‌స లేద‌ని వ్యాఖ్యానించ‌టంతో పాటు.. కార్మికశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ దాఖ‌లు చేసుకున్న వ్య‌క్తిగ‌త మిన‌హాయింపు ఇచ్చేందుకు నో చెప్పింది. తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ర‌మేశ్ రంగ‌నాథ‌న్‌.. న్యాయ‌మూర్తి జ‌స్లిస్ తెల్ల‌ప్రోలు ర‌జ‌నీల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తాజా ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.

రూల్స్‌కు విరుద్ధంగా ఉభయ రాష్ట్రాల్లో బ‌స్సు ఆప‌రేట‌ర్లు బ‌స్సులు న‌డుపుతున్నా అధికారులు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని.. ఈ కార‌ణంతోనే ముండ్ల‌పాడు వ‌ద్ద దివాక‌ర్ ట్రావెల్స్ బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగిందంటూ లాయ‌ర్ కేవీ సుబ్బారెడ్డి హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు.దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాల‌ని రెండు రాష్ట్రాల అధికారుల‌కు హైకోర్టు ఆదేశించింది. దివాక‌ర్ ట్రావెల్స్‌కు ఏపీ అధికారులు క్లీన్ చిట్ ఇవ్వ‌గా..తెలంగాణ అధికారులు అందుకు విరుద్ధ‌మైన నివేదిక‌ను ఇచ్చింది. దివాక‌ర్ ట్రావెల్స్ బ‌స్సు మోటారు ట్రాన్ పోర్ట్ కార్మికుల చ‌ట్టం కింద రిజిస్ట‌ర్ చేసుకోలేద‌ని తెలంగాణ స‌ర్కారు త‌న నివేదిక‌లో స్ప‌ష్టంగా వెల్ల‌డించింది.

రెండు తెలుగు రాష్ట్రాలు దాఖ‌లు చేసిన నివేదిక‌ల్లో ఉన్న వైరుధ్యాల్ని గుర్తించిన ధ‌ర్మాస‌నం ఏపీ స‌ర్కారు ఎలా క్లీన్ చిట్ ఇస్తుంద‌ని ప్ర‌శ్నించింది. చ‌ట్టం కింద రిజిస్ట‌రే చేసుకోక‌పోతే.. చ‌ట్ట ఉల్లంఘ‌నే అవుతుంద‌ని.. మ‌రి ఉల్లంఘ‌న లేదంటూ ఎలా చెబుతార‌ని ఏపీ స‌ర్కారు త‌ర‌ఫున హాజ‌రైన అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ శ్రీనివాస్‌ను క్వ‌శ్చ‌న్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఏపీ అధికారుల తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది.

కోర్టు ఆదేశాల విష‌యంలో అధికారులు సీరియ‌స్ గా ఉన్న‌ట్లు క‌నిపించ‌టం లేద‌ని.. అలా లేకుంటే ఆ విష‌యాన్ని త‌మ‌కు చెబితే.. తామేం చేయాలో తెలుసంటూ ధ‌ర్మాస‌నం ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో.. ఏపీ ఏజే రెండు రాష్ట్రాల నివేదిక‌లోని వైరుధ్యాల్ని గుర్తించిన‌ట్లుగా తెలుపుతూ.. త‌న‌కు మూడు వారాల గ‌డువునిస్తే.. పూర్తి వివ‌రాల్ని కోర్టుకు స‌మ‌ర్పిస్తాన‌ని చెప్ప‌టంతో ఈ కేసు విచార‌ణ‌ను వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది. మొత్తానికి దివాక‌ర్ ట్రావెల్స్ పుణ్య‌మా అని ఉమ్మ‌డి హైకోర్టులో ఏపీ స‌ర్కారు ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English