ఆమెను జైల్లోనే రేప్ చేస్తామ‌న్నార‌ట‌

ఆమెను జైల్లోనే రేప్ చేస్తామ‌న్నార‌ట‌

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన షీనాబోరా హ‌త్య‌కేసులో నిందితురాలు ఇంద్రాణి ముఖ‌ర్జీ. టాప్ మోస్ట్ మీడియాకు చెందిన కీల‌క అధికారి స‌తీమ‌ణిగా.. సెల‌బ్రిటీ స‌ర్కిల్స్ లో ప్ర‌ముఖురాలిగా సుప‌రిచితురాలైన ఆమె గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన వెంట‌నే.. వ‌య‌సు మీద ప‌డినా చెక్కుచెద‌రని అందంతో ఉండే ఆమె ముఖం గుర్తుకు వ‌స్తుంది. అయితే..అత్యాశ‌తో క‌న్న కూతుర్నే అత్యంత కిరాత‌కంగా చంపిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చి షాక్ తినేలా చేసింది. అలాంటి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌టం వ‌ర‌కూ అంద‌రూ అప్డేట్ అయ్యారు. ఆ త‌ర్వాత ఆ విష‌యాన్ని య‌థావిధిగా ప్ర‌జ‌లు మ‌ర్చిపోయారు.

అనుకోని రీతిలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా ఇంద్రాణి ముఖ‌ర్జీ మీడియాలోకి వ‌చ్చారు. అయితే.. ఈసారి ఆమెను చూసిన వారంతా షాక్ తినే ప‌రిస్థితి. జైలుకు వెళ్లే ముందు థ‌ర్టీ ప్ల‌స్ లో ఉన్న‌ట్లుగా క‌నిపించిన ఈ ప‌డ‌తి.. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమె ఫోటోల్లో సిక్స్టీకి  ద‌గ్గ‌ర‌గా వ‌చ్చేసిన‌ట్లుగా ఉండ‌ట‌మే కాదు..ఈమేనా ఇంద్రాణి అన్న అనుమానం వ‌చ్చేలా మారిపోవ‌టం క‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం ఆమె జైల్లో ఉంటున్న బైక‌ల్లా సిబ్బంది ఆమెను కొట్టార‌ని.. తిట్టార‌ని.. అవ‌స‌ర‌మైతే ఆమెను రేప్ చేస్తామంటూ జైలు సిబ్బంది ఆమెకు వార్నింగ్ ఇచ్చార‌న్న మాట ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.  జైల్లో ఉన్న ఆమెను ఉన్న‌ట్లుండి అంత‌లా హింసించాల్సిన అవ‌స‌రం జైలు సిబ్బందికి ఎందుకు వ‌చ్చింద‌న్న‌ది మ‌రో సందేహం.  ఇంత‌కీ జ‌రిగిందేమంటే.. బైక‌ల్లా జైలులో 45ఏళ్ల మంజురా అనే ఖైదీ తాజాగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించింది. జైలు సిబ్బంది ఆమెను కొట్ట‌టం కార‌ణంగానే ఆమె మ‌ర‌ణానికి కార‌ణమ‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఆమె మ‌ర‌ణంపై జైల్లోని ఖైదీలు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ ఆందోళ‌న‌లు చేప‌ట్టారు.ఈ ఆందోళ‌న‌ల్లో భాగంగా జైలు డాబా మీద‌కు ఎక్కిన ఇంద్రాణి వార్తా ప‌త్రిక‌ల‌కు నిప్పు పెడుతూ జైలు సిబ్బందికి వ్య‌తిరేకంగా నినాదాలు చేసిన‌ట్లుగా వార్త‌లు రావ‌టం తెలిసిందే.

జైలులోని ఖైదీ మృతికి నిర‌స‌న‌గా ఇంద్రాణి చేప‌ట్టిన ఆందోళ‌న‌పై జైలు సిబ్బంది క‌న్నెర్ర చేశార‌ని.. ఆమెను దారుణంగా తిట్ట‌ట‌మే కాదు కొట్టార‌ని.. ఆందోళ‌న‌లు చేస్తే లైంగిక దాడి సైతం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించిన‌ట్లుగా ఆమె త‌ర‌ఫు న్యాయ‌వాది జైలు సిబ్బందిపై కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఇంద్రాణి కాళ్లు.. చేతులు.. ముఖం మీద ఉన్న గాయాల్ని త‌న‌కు చూపించిన‌ట్లుగా ఆమె త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జైలు సిబ్బంది అకృత్యాల కార‌ణంగా మ‌ర‌ణించిన మంజారాను జైల్లో దారుణంగా హింసించార‌ని.. ఆమె జ‌న‌నాంగంలోకి లాఠీ జొప్పించార‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇంద్రాణిని నేడు (బుధ‌వారం) కోర్టుకు హాజ‌రుప‌ర్చాల‌ని కోర్టు ఆదేశించింది. మ‌రి.. కోర్టుకు రానున్న ఇంద్రాణి ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు