ఇస్రో మళ్లీ అద‌ర‌గొట్టేసింది

ఇస్రో మళ్లీ అద‌ర‌గొట్టేసింది

క‌ష్ట‌ప‌డే త‌త్త్వం.. లోప్రొఫైల్ మొయింటైన్ చేయ‌టం.. కోట్లాది ప్ర‌జ‌ల ఆశ‌లు.. ఆకాంక్ష‌లు త‌మ‌పై ఉన్నాయ‌న్న విష‌యాన్ని అనునిత్యం గుర్తు పెట్టుకొని క‌మిట్ మెంట్ తో ప‌ని చేసే ఇస్రో మ‌రోసారి స‌క్స‌స్ అయ్యింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని స‌తీశ్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ నుంచి తాజాగా మ‌రో భారీ ప్ర‌యోగాన్ని నిర్వ‌హించారు. ఎప్ప‌టి మాదిరే తాజా ప్ర‌యోగం సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది.

ముందుగా అనుకున్న ముహుర్తానికి (ఈ ఉద‌యం 9.29 గంట‌లు) నిప్పులు చిమ్ముతూ పీఎస్ఎల్‌వీ సీ 38 రాకెట్ అంత‌రిక్షంలోకి దూసుకెళ్లింది. తాజా ప్ర‌యోగంలో మొత్తం 31 ఉప‌గ్ర‌హాల్ని ఇస్రో ప్ర‌యోగించింది. వీటిల్లో మ‌న దేశానికి చెందిన‌వి రెండు కాగా.. 14 దేశాల‌కు చెందిన 29 ఉప‌గ్ర‌హాలు ఉండ‌టం గ‌మ‌నార్హం.

పీఎస్ఎల్‌వీ సిరీస్‌లో ఇది 40వ ప్ర‌యోగం కాసా.. ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్ట‌ర్ల ప్ర‌యోగంలో ఇది 17వ‌ది కావ‌టం విశేషం. భౌగోళిక స‌మాచారం కోసం కార్డోశాట్ ఉప‌గ్ర‌హాల సిరీస్‌ను 2005లో రూపొందించారు. దేశీయ అవ‌స‌రాల కోసం కార్టోశాట్ సిరీస్ ప్ర‌యోగాల్ని ఇస్రోవ‌రుస‌గా నిర్వ‌హిస్తోంది.

తాజాగా ప్ర‌యోగించిన కార్టోశాట్ 2 ఉప‌గ్ర‌హం ఐదేళ్ల పాటుసేవ‌లు అందించ‌నుంది. ఇందులో అమ‌ర్చిన మ‌ల్టీస్పెక్ట్ర‌ల్ కెమెరా భూమిని ప‌రిశోధిస్తూ అత్యంత నాణ్య‌మైన ఫోటోల్ని అందిస్తుంది. తాజా ప్ర‌యోగంతో ప‌ట్ట‌ణ‌..గ్రామీణాభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌కు.. స‌ముద్ర‌తీర ప్రాంతాల‌నిర్వ‌హ‌ణ‌.. ర‌హ‌దారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌.. నీటి పంపిణీ.. భూవినియోగంపై మ్యాప్‌ల త‌యారీ.. విప‌త్తుల్ని విస్తృతంగా అంచ‌నా వేసే టెక్నాల‌జీ అందుబాటులోకి రానుంది. దీంతో వ్య‌వ‌సాయానికి సంబంధించిన స‌మాచారాన్ని అందుబాటులోకి తీసుకురావొచ్చు. తాజా ప్ర‌యోగంలో త‌మిళ‌నాడులోని నూరుల్ ఇస్లాం వ‌ర్సిటీ విద్యార్థులు త‌యారు చేసిన శాటిలైట్ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు