ఆ డైరెక్ట‌ర్‌పై కాంగ్రెస్ క‌స్సుమంటోంది!

ఆ డైరెక్ట‌ర్‌పై కాంగ్రెస్ క‌స్సుమంటోంది!

అదేంటీ... కాంగ్రెస్ పార్టీ నేత‌లేంటీ?... బాలీవుడ్ ద‌ర్శ‌కుడిపై కారాలు మిరియాలు నూర‌డ‌మేమిట‌నేగా మీ డౌటే? ఎంత డైరెక్ట‌ర్ అయితే మాత్రం... కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌పై సినిమాలు తీసి... ఆ నిర్ణ‌యాల‌ను ఏకిపారేస్తామంటే ఆ పార్టీ నేత‌లు మాత్రం ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. అయినా కాంగ్రెస్ పార్టీ నేత‌ల క‌డుపు మండేలా చేసిన ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రు? ఆయ‌న తీస్తున్న సినిమా ఏమిటీ? అనే వివ‌రాల్లోకెళితే... వివాదాస్ప‌ద అంశాల‌నే క‌థ‌నంగా తీసుకుని సినిమాలు తెర‌కెక్కించే ద‌ర్శ‌కులు ఎవ‌రంటే.. రామ్ గోపాల్ వ‌ర్మ అని ఠ‌క్కున చెప్పేస్తాం. ఇంకాస్త ఆలోచిస్తే... మ‌న‌కు ఇంకో పేరు కూడా గుర్తుకు వ‌స్తుంది. ఆ పేరే మాధుర్ భండార్క‌ర్‌.

బాలీవుడ్‌లో ప‌లు హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ముద్ర‌ను సంపాదించుకున్న భండార్క‌ర్ ఏ చిత్రం తీసినా... దానిపై ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంటుంది. తాజాగా ఆయ‌న *ఇందూ స‌ర్కార్‌* అనే ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. దివంగ‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీ హ‌యాంలో దేశంలో అమ‌లైన ఎమ‌ర్జెన్సీని మ‌న క‌ళ్ల‌కు క‌ట్టేలా చూపేందుకు భండార్క‌ర్ ఆ చిత్రాన్ని తీస్తున్నార‌ట‌. ఎప్పుడో 1975 మొద‌లుకుని 1977 దాకా ఏకంగా 21 నెల‌ల పాటు దేశంలో అమ‌లైన ఎమ‌ర్జెన్సీ పాల‌న‌ను ఇప్ప‌టికీ మ‌న పెద్దోళ్లు క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్ప‌టి త‌రంలోని వారికి నాటి ప‌రిస్థితులు అంత పెద్ద‌గా తెలియ‌వు. ఇక రానున్న త‌రానికి నాటి ప‌రిస్థితులు అస‌లు తెలిసే అవ‌కాశాలే లేవు.

అయితే భావి త‌రాల‌కు నాటి ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో క‌ళ్ల‌కు క‌ట్టేలా చూపేందుకే తాను ఇందూ స‌ర్కార్ చిత్రాన్ని తీస్తున్నానంటూ భండార్క‌ర్ సెల‌విచ్చారు. ప్ర‌క‌టించిందే త‌డ‌వుగా ఆయన స‌ద‌రు చిత్రాన్ని శ‌ర‌వేగంగా తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రం షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావ‌చ్చిన‌ట్లు, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రం వ‌చ్చే నెల 28న విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని వివ‌రాలు ఎలాగో బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి.

నాడు ఇందిరా గాంధీ ప్ర‌ధానిగా ఉండ‌గా, ఆమె కుమారుడు సంజ‌య్ గాంధీ న‌డిపిన స‌మాంత‌ర ప్ర‌భుత్వం, ఎమ‌ర్జెన్సీలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరునే క‌థాంశంగా తీసుకుని భండార్క‌ర్ ఈ చిత్రాన్ని తీస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదే విష‌యం చెవిన ప‌డ్డ కాంగ్రెస్ నేత‌లు నిన్న తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేశారు. ఆ పార్టీ యువ నేత‌, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాథిత్య సింధియా ఏకంగా మీడియా ముందుకు వ‌చ్చి మ‌రీ భండార్క‌ర్‌పై అంతెత్తున ఎగిరి ప‌డ్డారు. ఇందూ స‌ర్కార్ చిత్రంలో త‌మ పార్టీకి త‌ప్పుడు ఆపాద‌న‌లు చేశార‌ని, చిత్రంలో భండార్క‌ర్ చూపించ‌నున్న అంశాల‌న్ని అబ‌ద్ధాల‌ని సింధియా ఆరోపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు