బాబు ప‌క్క‌నే కూర్చుని బాబునే తిడుతున్నాడు

బాబు ప‌క్క‌నే కూర్చుని బాబునే తిడుతున్నాడు

ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి... ఐఏఎస్ అయిన ప్ర‌తి ఉన్న‌తాధికారి రాష్ట్ర కేడ‌ర్‌లో ప‌నిచేస్తుంటే త‌న ల‌క్ష్యంగా భావించే హోదా అది. ఎందుకంటే కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకునే కేబినెట్ వంటి స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి ప‌క్క సీటులోనే ఆసీనులై వాటిపై త‌మదైన అభిప్రాయం వెల్ల‌డించవ‌చ్చు. ఇక ప‌రిపాల‌న ప‌రంగా చూస్తే అన్ని నిర్ణ‌యాల‌ను ప్ర‌భావితం చేసే వ్య‌క్తి. అలా ప‌నిచేసిన మాజీ అధికారి ఇప్పుడు బాబుకు పంటికింద రాయిలా మారిపోయార‌ని టీడీపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌నే ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు.

ఐవైఎర్ ప‌నితీరును అప్ప‌ట్లో న‌చ్చిన ఏపీ సీఎం చంద్ర‌బాబు తన స‌ర్కారులో ప్రధాన కార్యదర్శిగా నియ‌మించుకున్నారు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అనంత‌రం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, కేబినెట్ హోదాతో సమానమైన చైర్మన్ పదవిని ఐవైఆర్ కృష్ణారావుకు కట్టబెట్టారు. అయితే తాజాగా ఐవైఆర్ చేస్తున్న ప‌నులు బాబును ఇర‌కాటంలో పనిచేస్తున్నాయ‌ని అంటున్నారు. అదే ఐవైఆర్‌ ఫేస్ బుక్ వ్యవహారం.  సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లపై సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలను కృష్ణారావు షేర్ చేయడం ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చకు దారితీస్తోంది. తనకు ప్రతిష్ఠాత్మకమైన పదవినిచ్చిన చంద్రబాబును, ఆయన తనయుడు లోకేష్ ను తీవ్రస్థాయిలో విమర్శించిన పోస్టులను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నారు. సోషల్ మీడియాలో విమర్శలను సరదాగా తీసుకోవాలి తప్ప కేసులు పెట్టడం నియంతృత్వమని ఫేస్ బుక్ లో కృష్ణారావు కామెంట్ చేయడం ప్రభుత్వ, టీడీపీ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

మ‌రోవైపు సినీ ప‌రిశ్ర‌మ‌ను సైతం ఐవైఆర్ ప్ర‌స్తావించారు. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను మినహాయింపు, బాహుబలి-2 అదనపు షోలకు అనుమతులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. టీటీడీ ఈవోగా తెలుగేతర అధికారిని నియమించడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.  ఇలా ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును నేరుగా విమర్శిస్తూ పెట్టే ఫోటోలు, పోస్టులను సైతం ఫేస్ బుక్ వాల్ పై షేర్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఇదే తీరు కొనసాగిస్తున్న ఐవైఆర్ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.  ప్రభుత్వం నియమించిన పదవిలో ఉంటూ ప్రభుత్వ విధానాలను విమర్శించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తన అభిప్రాయాలను సర్కారుకే చెప్పే అవకాశం ఉండగా ఫేస్ బుక్ లో విమర్శలు గుప్పించడాన్ని సర్కార్ సీరియస్ గా తీసుకున్నట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లోనే బాబు ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు ఈరోజు ఐవైఆర్ విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు. తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తానని ఈ వ్యవహారంపై ప్రశ్నించిన సన్నిహితులకు కృష్ణారావు చెప్పినట్టు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు