మోడీ ఫోన్ చేస్తే.. కేసీఆర్ రియాక్ష‌న్ ఇది..

మోడీ ఫోన్ చేస్తే.. కేసీఆర్ రియాక్ష‌న్ ఇది..

విల‌క్ష‌ణ‌మైన వ్య‌వ‌హార‌శైలి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ది. ఆయ‌న ఎప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో.. ఆయ‌న స‌న్నిహితుల‌కు సైతం కొన్నిసార్లు అర్థం కాద‌ని చెబుతారు. ప‌రిస్థితులు.. ప‌రిణామాల‌కు త‌గిన‌ట్లుగా రియాక్ట్ కావ‌టం కేసీఆర్‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీద‌న్న విష‌యాన్ని గులాబీ నేత‌లే త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చెబుతుంటారు.

కేంద్ర‌మంత్రి స్వ‌యంగా ఫోన్ చేస్తే.. అందుబాటులోకి రాక‌పోవ‌టం కేసీఆర్‌కు మాత్ర‌మే చెల్లుతుంది. అందుకు పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం కూడా త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంద‌న్న విష‌యాన్ని కేసీఆర్ త‌న చేత‌ల‌తో మ‌రోసారి నిరూపించారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బీహార్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ రామ్ నాథ్ ను నియ‌మిస్తూ బీజేపీ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే.

రాష్ట్రప‌తి అభ్య‌ర్థిని ఎంపిక చేసిన వెంట‌నే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఫోన్ చేశారు ప్ర‌ధాని మోడీ. త‌మ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు తెల‌పాల్సిందిగా కోరారు. ప్ర‌ధానే స్వ‌యంగా లైన్లోకి రావ‌టంతో త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు కేసీఆర్‌. పార్టీ నేత‌ల‌తో ఒకసారి చ‌ర్చించి త‌మ నిర్ణ‌యం చెబుతాన‌ని చెప్ప‌ట‌మే కాదు.. ఆఘ‌మేఘాల మీద పార్టీ ముఖ్య‌ల‌తో చ‌ర్చించి.. వెనువెంట‌నే త‌మ మ‌ద్ద‌తును ఓపెన్ గా చెప్పేశారు కేసీఆర్‌.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా రామ్‌నాథ్‌ను ప్ర‌క‌టించిన త‌ర్వాత ఎన్డీయేత‌ర ప‌క్ష పార్టీ ఓపెన్ గా త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది టీఆర్ఎస్ పార్టీనే కావ‌టం గ‌మ‌నార్హం. పెద్ద‌నోట్ల ర‌ద్దు అనంత‌రం కూడా దేశంలో మ‌రే రాజ‌కీయ ప‌క్షం మోడీ నిర్ణ‌యాన్ని మ‌ద్ద‌తు తెల‌ప‌న‌ప్ప‌టికీ.. కేసీఆర్ మాత్రం బ‌హిరంగంగా స‌మ‌ర్థించ‌ట‌మే కాదు.. స్వ‌యంగా ప్ర‌ధానిని క‌లిసి.. త‌న మ‌ద్ద‌తును తెలిపిన విష‌యం తెలిసిందే. న‌చ్చితే ఆకాశానికి ఎత్తేయ‌టం.. తేడా వ‌స్తే పాతాళానికి నొక్కేయ‌టం బాగా తెలిసిన కేసీఆర్‌కు.. మోడీ లాంటి నేత‌కు సాయం అవ‌స‌ర‌మైతే స‌హ‌క‌రించ‌కుండా ఉంటారా? ఆఘ‌మేఘాల మీద ఆయ‌న స్పందించిన తీరును మోడీ అంత‌తేలిగ్గా మ‌ర్చిపోగ‌ల‌రా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు