పాక్ కి కంగ్రాట్స్ చెబితే... గంభీర్ కి మండింది

పాక్ కి కంగ్రాట్స్ చెబితే... గంభీర్ కి మండింది

ఓపిక‌కు అయినా ఒక హ‌ద్దు ఉంటుంద‌ని..అతిగా స్పందిస్తే అదే రీతిలో రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంద‌ని మ‌న‌ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ నిరూపించాడు. కాశ్మీర్ వేర్పాటువాది మిర్వేజ్ ఫ‌రూక్‌పై సీరియ‌స్ అవ‌డం ద్వారా తేడా వ‌స్తే తేల్చుకోవ‌డ‌మే అనే సందేశాన్ని పంపించాడు. చాంపియ‌న్స్ ట్రోఫీ సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన త‌ర్వాత కూడా ఫ‌రూక్ పాక్ టీమ్‌ను ప్ర‌శంసిస్తూ ట్వీట్ చేశాడు. అది చాల‌ద‌న్న‌ట్లుగా ఇండియ‌న్ క్రికెట్ టీమ్ చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో ఇండియా ఓడిపోయిన అనంతరం ఫ‌రూక్ రెచ్చ‌గొట్టే ట్వీట్ చేశాడు. ``పాక్ గెలవ‌గానే ఎటు చూసినా ప‌టాకుల మోత‌తో ఈద్ ముందే వ‌చ్చిన‌ట్లుంది.. పాక్ టీమ్‌కు శుభాకాంక్ష‌లు`` అంటూ ఫ‌రూక్ ట్వీట్ చేశాడు.

తాజాగా జ‌రిగిన ఫైన‌ల్స్ ఫ‌లితంపై ఫ‌రూక్ ఉద్దేశ‌పూర్వ‌కంగా రెచ్చ‌గొట్టే ట్వీట్ చేయ‌డంతో గంభీర్ ఇక ఏమాత్రం కామ్‌గా ఉండలేక‌పోయాడు. గంభీర్ కాస్త వెట‌కారంగా స్పందిస్తూ పాకిస్థాన్ గెలిస్తే.. వెళ్లి ఆ దేశంలోనే సెల‌బ్రేట్ చేసుకో అంటూ గౌతీ ట్వీట్ చేశాడు. ``ఫ‌రూక్.. నీకో స‌ల‌హా. మీరు స‌రిహ‌ద్దు క్రాస్ చేస్తే ఇంకా మంచి ప‌టాకులు (చైనీస్‌) దొరుకుతాయి. అక్క‌డే ఈద్ సెల‌బ్రేట్ చేసుకో. ప్యాకింగ్‌లో మీకు నేను సాయం చేస్తా`` అని గంభీర్ ట్వీట్ చేశాడు. కాగా, గ‌తంలోనూ కాశ్మీర్ ఆందోళ‌న‌కారులపై, వేర్పాటువాదుల‌పై ట్వీట్స్ చేశాడు.

మ‌రోవైపు చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో ఓడిపోయి ఉండొచ్చు. కానీ మ‌న టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం పాక్ అభిమానుల మ‌న‌సు గెలుచుకున్నాడు. మ్యాచ్ ఓడిన త‌ర్వాత విరాట్ మాట్లాడిన మాట‌లు అక్క‌డి ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకున్నాయి. ``పాక్ టీమ్‌కు శుభాకాంక్ష‌లు. వాళ్లు అద్భుతంగా ఆడారు. టోర్నీలో వాళ్లు ప‌డి లేచిన తీరు అద్భుతం. ఆ దేశంలో ఎంత టాలెంట్ ఉందో చెప్ప‌డానికి ఇదే నిద‌ర్శ‌నం. వాళ్ల‌దైన రోజున ఎలాంటి టీమ్‌నైనా మ‌ట్టిక‌రిపించే స‌త్తా ఉంద‌ని మ‌రోసారి నిరూపించారు`` అని కోహ్లి మ్యాచ్ త‌ర్వాత అన్నాడు. పాక్ ఓపెన‌ర్ ఫ‌క‌ర్ జ‌మాన్‌పై కోహ్లి ప్ర‌శంస‌లు కురిపించాడు. కోహ్లి ప‌రిణ‌తితో చేసిన కామెంట్స్ పాక్ ఫ్యాన్స్ మ‌ది దోచుకున్నాయి. ట్విట్ట‌ర్‌లో వాళ్లు విరాట్‌ను తెగ మెచ్చుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు