ట్రిపుల్ థ‌మాకాలో క్రికెట్ ఫ‌ట్‌.. ఆ రెండూ సూప‌ర్ హిట్!

ట్రిపుల్ థ‌మాకాలో క్రికెట్ ఫ‌ట్‌.. ఆ రెండూ సూప‌ర్ హిట్!

ఒకే రోజులో.. మూడు కీల‌క మ్యాచ్‌లు. అందులో రెండు క్రీడ‌ల్లో ప్ర‌త్య‌ర్థి దాయాది పాకిస్థాన్. మ‌రి.. ఇలాంటి రోజు క్రీడాభిమానుల‌కు ఏం మిగిల్చిందంటే.. బోలెడంత బాధ కూసింత ఆనందాన్ని అందించింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యంఏమిటంటే.. దేశంలో అతి పెద్ద మ‌త‌మైన క్రికెట్ దేశ ప్ర‌జ‌ల్ని తీవ్ర నిరాశ‌ను.. ఆవేద‌న‌ను క‌లిగిస్తే.. పెద్ద‌గా ఆద‌ర‌ణ లేని హాకీ.. బ్యాడ్మింట‌న్లో భారీ విజ‌యాలు సాధించి కూసింత సంతోషాన్ని మిగిల్చాయ‌ని చెప్పాలి.
 
ఐసీసీ ఛాంపియ‌న్ ట్రోఫి ఫైన‌ల్ మ్యాచ్‌లో పాక్ తో త‌ల‌ప‌డిన బార‌త్ ఘోర ప‌రాజ‌యాన్ని మూట గ‌ట్టుకుంటే.. అందుకు భిన్నంగా హాకీలో మ‌నోళ్లు పాక్ జ‌ట్టుపై అద్భుత విజ‌యాన్ని సాధించారు. అంతేనా.. మ‌న తెలుగోడు.. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింట‌న్ సీరిస్‌లో విజేత‌గా నిలిచి.. సంతోషాన్ని మిగిల్చారు. ఇక‌.. ట్రిపుల్ థ‌మాకాలో ఒక్కో అంశాన్ని విడివిడిగా చూస్తే..

దేశ‌మంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసిన భార‌త్‌..పాకిస్థాన్ ఫైన‌ల్ మ్యాచ్ లో టీమిండియా ఘోర ప‌రాజ‌యాన్ని పొందింది. టాస్ గెలిచి పాకిస్థాన్‌కు బ్యాటింగ్ కు ఆహ్వానించిన నేప‌థ్యంలో నిర్ణీత 50 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి నాలుగు వికెట్ల నష్టానికి 338 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ లక్ష్యాన్ని చేధించేందుకు రంగంలోకి దిగిన రోహిత్ శ‌ర్మ‌.. కోహ్లీలు ఘోర వైఫ‌ల్యంతో ఆరంభంలోనే రెండు వికెట్ల‌ను టీమిండియా కోల్పోయింది. మ‌ధ్య‌లో శిఖ‌ర్ ధావ‌న్ (22 బంతుల్లో 21 ప‌రుగులు).. చివ‌ర్లో హార్దిక్ పాండ్యా (43 బంతుల్లో 76 ప‌రుగులు) త‌ప్ప మిగిలిన క్రికెట‌ర్లు వ‌రుస‌గా పెవిలియ‌న్ కు క్యూ క‌ట్టారు. బ్యాటింగ్‌.. బౌలింగ్‌.. ఫీల్డింగ్ రంగాల్లో స‌మిష్టిగా కృషి చేసిన పాకిస్థాన్‌కు ఛాంపియ‌న్ ట్రోపీ ద‌క్కింది. ఫైనల్లో టీమిండియా విజ‌యం ప‌క్కా అని భావించిన కోట్లాదిమంది భార‌తీయుల‌కు కోహ్లీసేన దిమ్మ తిరిగే షాకిచ్చింది.

ట్రిఫుల్ థ‌మాకాలో భారీ విజ‌యాన్ని అందించాడు మ‌న తెలుగు యువ‌కిశోరం.. బ్యాడ్మింట‌న్ స్టార్ కిదాంబి శ్రీకాంత్‌. జ‌కార్తాలో జ‌రిగిన ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింట‌న్ సిరీస్ లో విజేత‌గా నిలిచారు. తెలుగోడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటాడు. పురుషుల సింగిల్స్ పోటీలో జ‌పాన్ ఆట‌గాడు క‌జుమాసా స‌కాయ్తో త‌ల‌ప‌డిన శ్రీకాంత్ రెండు వ‌రుస‌సెట్ల‌లో విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. తొలిసెట్లో విజ‌యం సాధించిన శ్రీకాంత్‌కు రెండోసెట్లో తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న‌ను ఎదుర్కొన్నాడు. ఓ ద‌శ‌లో వెనుక‌బ‌డిన‌ప్ప‌టికీ అంత‌లోనే తేరుకున్న శ్రీకాంత్ కోలుకొని విజృంభించాడు. దీంతో.. వ‌రుస సెట్ల‌లో అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించాడు. అంత‌ర్జాతీయంగా ఒక తెలుగు కుర్రాడు సాధించిన విజ‌యానికి తెలుగోళ్లంతా సంతోషించాల్సిందే. శ్రీకాంత్ విజ‌యంతో అత‌డి సొంతూరు గుంటూరులో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ట‌పాసులు పేల్చి.. మిఠాయిలు పంచుతూ త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

ప్ర‌పంచ హాకీ లీగ్ సెమీఫైన‌ల్ టోర్నీలో భార‌త్ జ‌ట్టు స‌త్తా చాటింది. పాకిస్థాన్‌పై 7-1 తేడాతో అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది. ఆట ప్రారంభం నుంచి త‌న అధిక్యాన్ని క‌న‌ప‌ర్చిన భార‌త్‌జ‌ట్టు ప్ర‌త్య‌ర్థికి ఏ ద‌శ‌లోనూ అవ‌కాశం ఇవ్వ‌లేదు. హీరోలుగా అంద‌రి దృష్టిలో నిలిచే టీమిండియా క్రికెట‌ర్లు ఓట‌మితో జీరోలు అయితే.. పెద్ద‌గా ఫేం లేని బ్యాడ్మింట‌న్.. హాకీ టీమ్ ల‌లో అద్భుత విజ‌యంతో హీరోలుగా అవ‌త‌రించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు