జ‌న‌సేన‌కు స్పంద‌న‌పై ప‌వ‌ర్ స్టార్ మాట విన్నారా?

జ‌న‌సేన‌కు స్పంద‌న‌పై ప‌వ‌ర్ స్టార్ మాట విన్నారా?

టాలీవుడ్‌లో త‌న‌కంటే ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోల్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌ర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడిగానే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్‌... కాల‌క్ర‌మేణా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఎవ‌రు అవున‌న్నా... కాద‌న్నా కూడా ఇది అక్ష‌ర స‌త్యం. ఇటీవ‌లే రాజ‌కీయాల్లోకి రంగ‌ప్ర‌వేశం చేసిన ప‌వ‌ర్ స్టార్... జ‌న‌సేన పేరిట ఓ రాజ‌కీయ  పార్టీని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. గ‌డచిన ఎన్నిక‌ల కంటే ముందుగానే పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఆ ఎన్నిక‌ల్లో పోటీకి కాస్తంత వెనుకంజ వేసిన ప‌వ‌ర్ స్టార్‌... టీడీపీ, బీజేపీ కూట‌మికి మద్ద‌తిచ్చి చంద్ర‌బాబును గ‌ద్దెనెక్కించ‌డంలో కీల‌క భూమిక పోషించారు.

ఇది జ‌రిగి ఇప్ప‌టికే మూడేళ్లు దాటి పోతోంది. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు రానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో జ‌న‌సేన బ‌రిలోకి దిగ‌డంతో పాటు తాను కూడా పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఘ‌నంగానే ప్ర‌క‌టించారు. అందుక‌నుగుణంగానే జిల్లాల వారీగా పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ఊపందుకుంది. ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ జిల్లాల్లో ప్రారంభ‌మైన ఈ ప్ర‌క్రియ ఇప్పుడు ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో కొన‌సాగుతోంది. జ‌న‌సేన నిర్వ‌హిస్తున్న శిబిరాల‌కు యువ‌త పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నార‌ట‌. ఆశించిన దాని కంటే కూడా అధిక స్పంద‌న ల‌భిస్తోంద‌ట‌.

ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన ప‌వ‌ర్ స్టార్‌... త‌న పార్టీకి జ‌నంలో మంచి స్పంద‌న ల‌భిస్తోంద‌ని సెల‌విచ్చారు. ఏపీలోని ఏడు జిల్లాలతో పాటు, తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ లో జనసేన పార్టీ ఎంపికలకు భారీ స్పందన వచ్చిందని ఆయ‌న చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా జిల్లాల్లోనూ పార్టీ ఎంపికలు వేగంగా జరుగుతున్నాయని, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్టు పవన్ చెప్పారు. ఇదంతా చూస్తుంటే... జ‌న‌సేన ప‌ట్ల ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఖుషీఖుషీగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు