విలీనంతో మ‌రో నాలుగు బ్యాంకులు ఖ‌ల్లాస్‌!

విలీనంతో మ‌రో నాలుగు బ్యాంకులు ఖ‌ల్లాస్‌!

దేశంలో ప్రస్తుత 21 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీన బాట ప‌ట్టించి మూడు, నాలుగు బ్యాంకులకే తగ్గించాలనే లక్ష్యంగా ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం ఈ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పటికే ఎస్‌బిఐలో పలు అసోసియేట్‌ బ్యాంకుల విలీనంతో ఉత్సాహంగా ఉన్న ఆర్థిక శాఖ మరో నాలుగు బ్యాంకులను ఏకీకరణ చేసే పనిలో పడింది. ఇదే విషయాన్ని ప్రభుత్వ సీనియర్‌ అధికారులు తెలిపారని జాతీయ ప్ర‌సార‌మాధ్య‌మాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రభుత్వ రంగంలో ఉన్న సిండికేట్‌ బ్యాంకు, కెనరా బ్యాంకు, విజయా బ్యాంకు, దేనా బ్యాంకులు విలీనంపై ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వశాఖకు వివరణాత్మక ప్రణాళికలను అందించాయని సమాచారం. విలీనంపై నీతి అయోగ్‌ సూచనలు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గత ఏడాది స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసోసియేట్‌ బ్యాంకులతో పాటు భారతీయ మహిళ బ్యాంకును విలీనం చేసిన విషయం తెలిసిందే. గ‌త ఏప్రిల్‌ నుంచే ఈ బ్యాంకులన్నీ ఎస్‌బిఐ పేరుతో సేవలందించడం ప్రారంభించాయి. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తోంది. తాజా ప్రతిపాదనలో ఉన్న నాలుగు బ్యాంకులు విలీనంపై ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారికి విడివిడిగా తమ నివేదికలను అందజేశాయి. ఇందులో రుణాలు, డిపాజిట్లు, మొండి బాకీలు, మానవ వనరులు, ఇతర ఆదాయాలు, వివిధ భౌగోళిక ప్రాంతాల్లో శాఖలు తదితర వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అవి సమర్పించాయి. ఈ నివేదికల ఆధారంగానే బ్యాంకుల విలీన సాధ్యాసాధ్యాలపై ఒక నిర్ణయానికి రానున్నారు. ఇదే రకమైన నివేదికలను ఇతర బ్యాంకుల నుంచి కూడా సమీకరించాలని ఆర్థిక మంత్రిత్వశాఖ యోచిస్తోంది.

న్యూఢిల్లీలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉన్నతాధికారుల సమావేశం భేటీ అనంతరం ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ బ్యాంకుల పనితీరు ఆధారంగా విలీనాలు జరుగుతాయని స్పష్టం చేశారు.  త‌మ‌ సమావేశంలో విలీన అంశం ప్రధాన ఎజెండా కాలేదన్నారు. అయినా ఆ దిశలోనే చురుకుగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు.  ఇదిలాఉండ‌గాగా...బ్యాంకుల విలీనంపై ప‌లువురు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే దేశ వ్యాప్తంగా మూడు, నాలుగు పెద్ద బ్యాంకులు మాత్రమే మిగులుతాయని సీనియ‌ర్‌ అధికారి ఒక‌రు పేర్కొన్నారు. రెండు, అంతకన్నా ఎక్కువ బ్యాంకుల విలీనానికి కేంద్రం ఆసక్తిగా ఉందన్నారు. అయితే బలహీనమైన బ్యాంకు చేతికి మాత్రం బాధ్యతలు, నిర్వహణ అప్పగించబోరన్నారు. మ‌రోవైపు బ్యాంకుల విలీనాల వల్ల ఖాతాదారులు, ఉద్యోగులకు కొన్ని నష్టాలు వాటిల్లే అవకాశం ఉందన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ఈ రంగంలో ఉద్యోగ నియామకాలు పడిపోనున్నాయి. బ్యాంకుల మధ్య పోటీ తగ్గనుంది. దీంతో సేవల్లో నాణ్యత తగ్గి ఖాతాదారులే నష్టపోనున్నారు. మరోవైపు ప్రభుత్వం బ్యాంకుల్లోని వాటాలను ప్రయివేటు, మార్కెట్‌ శక్తులకు అమ్ముకోవడానికి మార్గం అత్యంత సులభం కానుందనే విమర్శలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు