అయ్య‌న్న‌పాత్రుడికి గంటా మంట‌

అయ్య‌న్న‌పాత్రుడికి గంటా మంట‌

విశాఖ జిల్లాలో ఇద్ద‌రు మంత్రులు అయ్య‌న్న పాత్రుడు, గంటా శ్రీనివాస‌రావు మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం కాస్తా ఇప్పుడు బ‌ట్ట‌బ‌య‌లైంది.  వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలున్న‌ట్లు ఎన్నోమార్లు బ‌య‌ట‌ప‌డ్డా కూడా ఇద్ద‌రూ ఎన్న‌డూ బ‌హిరంగంగా ఒక‌రితో ఒక‌రు త‌ల‌ప‌డ‌లేదు. ఒక‌రిపై ఒక‌రు అధినేత‌కు లిఖిత పూర్వ‌క ఫిర్యాదులూ చేసుకోలేదు. కానీ... తాజాగా మంత్రి గంటా శ్రీనివాస‌రావు అయ్య‌న్న‌పాత్రుడిపై ఫిర్యాదు చేస్తూ చంద్ర‌బాబుకు లేఖ రాశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం మొద‌లైంది.  అయ్యన్న పాత్రుడి వైఖరి వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్ర‌బాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

అయితే... ఎప్ప‌టి నుంచో తీవ్ర విభేదిస్తున్న ఈ ఇద్ద‌రూ అధినేత వ‌ద్ద ఒక‌రినొక‌రు దెబ్బ‌తీయ‌డానికి అవ‌కాశం కాచుక్కూచున్నారు.  ఇప్పుడు ఇద్ద‌రికీ అలాంటి అవ‌కాశం చిక్కింది. విశాఖ భూకుంభ‌కోణంలో అంద‌రి వేళ్లూ గంటా వైపే చూపిస్తున్న త‌రుణంలో అయ్య‌న్న‌పాత్రుడు అదే అవ‌కాశంగా కొంత‌కాలంగా తాను టీడీపీ మంత్రిని అన్న విష‌యం ప‌క్క‌న పెట్టి మ‌రీ దీనిపై ఆయ‌న స్వ‌యంగా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. దీంతో గంటా ఆ పాయింటే రెయిజ్ చేస్తూ చంద్ర‌బాబుకు లేఖ రాశారు. మంత్రిగా ఉంటూ అయ్య‌న్న చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని, ఆయనను నియంత్రించాల్సిన అవసరం ఉందని గంటా త‌న లేఖ‌లో చంద్ర‌బాబుకు సూచించారు. విశాఖపట్టణంలో భూ కుంభకోణం జరిగిందన్న అయ్యన్న ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో కూడా అయ్యన్న చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరిగిందని గంటా పాత‌క‌థ‌ల‌న్నీ త‌వ్వి తీస్తున్నారు. విశాఖ ఉత్సవ్‌, ల్యాండ్‌ పూలింగ్‌, చంద్రన్న సంక్రాంతి కానుకల పథకాలపై  అయ్య‌న్న నిరాధార ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని ఇరకాటం​లో పెట్టారని గంటా ఆరోపించారు. ఇటీవల వెలుగు చూసిన విశాఖ భూకుంభకోణంలో టీడీపీ నాయకుల పాత్ర ఉందని మీడియా సమావేశాలు పెట్టి ఆరోపణలు చేయడం​ సంచలనం రేపిందని గుర్తు చేశారు. అయన్నపాత్రుడి ఆరోపణలతో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని తెలిపారు. అయన్న ఆరోపణలతో విశాఖ ప్రతిష్టతో పాటు యావత్‌ రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదముందని ఆవేదన చెందారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు