ఏడుకొండలవాడికీ జీఎస్టీ తప్పదట

ఏడుకొండలవాడికీ జీఎస్టీ తప్పదట

దేశమంతా ఒకే పన్ను అంటూ తీసుకొస్తున్న జీఎస్టీ నుంచి తిరుమల వెంకటేశ్వరస్వామికి ఏమాత్రం మినహాయింపు ఇవ్వబోరట. వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి అమలులోకి రానున్న ఈ జీఎస్టీ పరిధిలోకి తిరుమల రావాల్సిందేనని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసేశారు. టీటీడీకి మినహాయింపు ఇవ్వడం వీలు కాదని.. ఒకవేళ అలా ఇస్తే దేశంలోని మిగతా సంస్థలన్నీ ఇదే కోరిక కోరతాయని ఆయన తెలిపారు.

కాగా, వస్తు సేవల పన్ను నుంచి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలను మినహాయించాలని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నిన్న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జైట్లీని కోరారు. దీంతో ఆయన ఈ విధంగా స్పందించారు.  అయితే.. ప్రస్తుతానికి దానిపై ఖ‌రాఖండీగా చెప్పినప్పటికీ వచ్చే సమావేశంలో ఈ విషయం చర్చిస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను నుంచి తిరుమలకు మినహాయింపు ఇచ్చిన దృష్ట్యా, జీఎస్టీ నుంచి కూడా తప్పించాలని జైట్లీని యనమల కోరారు.

మరోవైపు నిన్న జరిగిన సమావేశంలో సామాన్యులపై  జీఎస్టీ ప్రభావం పడకుండా 66 వస్తువులపై జీఎస్టీ మండలి పన్నుకోత విధించింది. జీఎస్టీ శ్లాబుల వర్గీకరణపై పరిశ్రమతో పాటు సమాజంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్లు, వినతులకు అనుగుణంగా రేట్ల విధానంలో మార్పు చేసింది. పన్ను రేట్లను 133 పరిశ్రమల నుంచి వచ్చిన డిమాండ్లను సమీక్షించి.. 66 వస్తువులపై పన్నురేట్లు తగ్గించాలని నిర్ణయించింది. ప్యాకేజ్డ్‌ ఆహారం, స్కూలు బ్యాగులతో పాటు రోజువారీ వినియోగంలో వచ్చే వస్తువులపై పన్ను తగ్గింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు