జ‌య‌ల‌లిత‌ను చంపేందుకు నా త‌మ్ముడు ప్ర‌య‌త్నించాడు

జ‌య‌ల‌లిత‌ను చంపేందుకు నా త‌మ్ముడు ప్ర‌య‌త్నించాడు

అన్నాడీఎంకే అధినేత్రి, అమ్మ‌గా ల‌క్ష‌లాది మంది త‌మిళుల‌ మ‌న‌సుల్లో చోటుచేసుకున్న దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత అభిమానులు ఆవేద‌న చెందే ప‌రిణామం ఇది. జ‌య‌ల‌లిత పార్టీ వారస‌త్వం కోసం ఇప్ప‌టికే అన్నాడీఎంకే నేత‌లు మూడు గ్రూపులుగా విడిపోయి ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హా ర‌చ్చ‌లోకి కొద్దికాలం క్రితం చేరిన జ‌య‌ల‌లిత కుటుంబ స‌భ్యులైన మేనకోడలు దీపాజయకుమార్, ఆమె సోద‌రుడు దీపక్ తాజాగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌కు వేదిక అయ్యారు. కుటంబ కుట్ర‌ల గురించి మేనకోడలు దీపాజయకుమార్ వివ‌రించారు.

త‌న మేన‌త్త‌, త‌మిళ‌నాడు సీఎం జయలలితను చంపేందుకు తన సోదరుడు దీపక్ యత్నించాడని మేనకోడలు దీపాజయకుమార్ ఆరోపించారు. దీపక్‌ను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని ప్రభుత్వాన్ని దీప డిమాండ్ చేశారు. పోయెస్ గార్డెన్‌లోకి వెళ్లేందుకు జయలలిత మేనకోడలు దీప, ఆమె మద్దతుదారులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, దీప మద్దతుదారుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ పోయెస్ గార్డెన్‌లోకి వెళ్లకుండా అడ్డుకుని తమను అవమానించారని మండిపడ్డారు.

త‌మ మేన‌త్త జ‌య‌ల‌లిత స‌న్నిహితురాలైన శశికళ కుటుంబం నుంచి అన్నాడీఎంకేను కాపాడాలని ప్రభుత్వాన్ని దీపాజ‌య‌కుమార్‌ కోరారు. శశికళతో తన సోదరుడు దీపక్ చేతులు కలిపి, తనపై దాడి చేయించారని దీప ఆరోపించారు. తనపై హత్యాయత్నం జరిగినట్లు ఆరోపించారు. తనపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దీప డిమాండ్ చేశారు. జయలలిత నివాసం స్వాధీనానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. జయలలిత ఆస్తికి తానే వారసురాలినని..పోయెస్ గార్డెన్స్ తనకే దక్కుతుందని దీప డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.