కేసీఆర్, చంద్రబాబుల్లో ఎవరు ఎవరికి బాకీ?

కేసీఆర్, చంద్రబాబుల్లో ఎవరు ఎవరికి బాకీ?

ఏపీ , తెలంగాణల మధ్య కరెంట్ యుద్ధం కొనసాగుతోంది. అదిప్పుడు ముట్టుకుంటే షాక్ కొట్టేలా మారింది. విద్యుత్‌ బకాయిలపై రెండు రాష్ట్రాలు లేఖలపై లేఖలు రాసుకుంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి.  మీరే మాకు అప్పున్నారంటే, మీరే మాకు బాకీ ఉన్నారంటూ రెండు రాష్ర్టాలు తమతమ వాదన వినిపిస్తున్నాయి.

    తాము సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధిం చిన బకాయిలు రూ.3138కోట్లు చెల్లించకపోతే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ పంపిణీ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా గురువారం ఏపీకి కౌంటర్‌ నోటీసు ఇచ్చింది. తెలం గాణ ట్రాన్స్‌కోకు ఏపీ డిస్కంలు రూ.1676.46కోట్లు బకాయి ఉన్నాయని వీటిని వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సంస్థల సీఎండి ప్రభాకర్‌ రావు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. బకాయిలు చెల్లించక పోతే విద్యుత్‌ సరఫరాను నిలిపి వేస్తామని లేఖలో హెచ్చరించారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ సమస్య జఠిలంగా మారుతోంది.

    రాష్ట్ర విభజన నేపద్యంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని ధర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కేంద్రం రెండు రాష్ట్రాలకు విభజించింది. అందులో ఆంధప్రదేశ్‌ రాష్ట్రం 46.11శాతం, తెలంగాణ రాష్ట్రం 53.89శాతం వాడుకోవాల్సివుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రానికి రోజుకు 1200మెగావాట్ల విద్యుత్‌ సరఫరా అవుతుండగా, తెలంగాణ రాష్ట్రం నుంచి 800మెగావాట్ల విద్యుత్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సరఫరా అవుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రం లోటు విద్యుత్‌లో ఉన్నందున ఆ రాష్ట్రానికి అదనంగా 400మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేస్తున్నందున ఆ మెత్తానికి రూ.3138కోట్లు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. మే 31లోపు బకాయి చెల్లించాలని లేకపోతే ఆతరువాత విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని నోటీసులో పేర్కొంది.

    తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ నోటీసులపై ఘాటుగానే స్పందించింది.తమకు ఏపీ నుంచి 1676.46 కోట్లు బకాయి ఉన్నందున ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని తెలంగాణ విద్యుత్‌ సంస్థల సీఎండి ప్రభాకర్‌ రావు తాజాగా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. వివిధ సంస్థలనుంచి తాము తెచ్చుకున్న రుణాలకు వాయిదాలు చెల్లించాలని, తమ ఆర్ధిక ఇబ్బందులు తమకు ఉన్నాయని లేఖలో స్పష్టం చేశారు. బకాయిలు చెల్లించకపోతే తాము ఏపీకి విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. అంతే కాకుండా రెండు రాష్ట్రాల మద్యన ఉన్న విద్యుత్‌ సమస్యలను శాశ్విత ప్రాతిపదికన  సెటిల్మెంటు చేసుకుందామని లేఖలో పేర్కొన్నారు. బకాయిలు చెల్లించాలని ఇదివరకే చాలా సార్లు లేఖలు రాసినా పట్టిం చుకోలేదని ఆయన అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు