టీడీపీ గుర్తు మాయమైపోతోంది..

టీడీపీ గుర్తు మాయమైపోతోంది..

తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్. కానీ... ఆ పార్టీకి సైకిళ్లే కరువైపోయాయి. సైకిల్ ర్యాలీ తీస్తే పట్టుమని 10 మంది కూడా సైకిళ్లతో రాలేకపోతున్నారు. రీసెంటుగా విజయవాడలో ఇలాగే జరిగింది. ఆ పార్టీ యువనేత దేవినేని అవినాశ్ కాలేజి కుర్రాళ్లలో భారీ సైకిల్ ర్యాలీ తీయాలని ప్రయత్నించారు. కానీ... తీరా ర్యాలీ రోజు వచ్చే సరికి సైకిళ్లు దొరకడం లేదన్న సంగతి గుర్తించారు. కాలేజి యూత్ ఎవరూ సైకిళ్లు వాడకపోవడంతో సైకిళ్లు అందుబాటులో లేవు... దీంతో చివరకు అద్దెకు సైకిళ్లు తెచ్చి కార్యక్రమం మమ అనిపించాల్సి వచ్చింది.

    విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీకి సైకిళ్లు కరువవడంతో 200 సైకిళ్లను అద్దెకు తీసుకుని ఒక వ్యాన్ లో అక్కడకు చేర్చారు. ఈ లోగా యూత్ ఆటోలు, బైకులపై వచ్చారు. వారంతా అక్కడికక్కడ అద్దె సైకిళ్లు వేసుకుని ర్యాలీలో పాల్గొన్నారు.

    అయితే... దేవినేని అవినాశ్ మాత్రం 60 మంది కాలేజి కుర్రాళ్లు సొంత సైకిళ్లపై వచ్చారని చెప్తున్నారు. అయినా... మరో 200 సైకిళ్లను టీడీపీ అభిమానులు సమకూర్చారని అన్నారు. కాలేజి యువత అంతా ఇప్పుడు బైకులపైనే వెళ్తుండడంతో సైకిళ్లు కనిపించడం లేదని ఆయన అంగీకరించారు. బైకు ర్యాలీ తీసి సక్సెస్ చేయడం తనకు సులభమే అయినా పార్టీ గుర్తు అయిన సైకిళ్లతో ర్యాలీ తీయాలని భావించే ఇలా చేశామని చెప్పారు. మొత్తానికి ఏదో రకంగా సైకిలు గుర్తుకు న్యాయం చేశారన్న మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు