గ్యాస్ మాఫియాయే వైఎస్ ను హత్య చేసింది: భూమన

గ్యాస్ మాఫియాయే వైఎస్ ను హత్య చేసింది: భూమన

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి విషయంలో ఉన్న అనుమానాలను వైసీపీ నేత  భూమన కరుణాకర్‌ రెడ్డి మరోసారి ప్రస్తావనకు తెచ్చారు.  వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిది ముమ్మాటికీ హత్యేనని ఆయన అన్నారు.  గ్యాస్‌ మాఫియా వైఎస్ ను హత్య చేసిందంటూ పరోక్షంగా ఓ ప్రముఖ సంస్థపై ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు.... ఇతర దేశాలకు చెందిన అధ్యక్షుల హత్యలతో దీన్ని పోల్చారాయన. ఈ నేపథ్యంలో భూమన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
 
గతంలో గ్వాటిమాలా, ప‌నామా దేశాల అధ్యక్షులు తమ దేశంలోని సహజవనరులు తమ దేశానికే దక్కాలని పట్టుబడ్డారని… ఆ తర్వాత కొద్ది రోజులకే వారు హత్యకు గురయ్యారని భూమన చెప్పారు. ఆ రెండు దేశాల అధ్యక్షులు ఇద్దరూ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూనే వైఎస్‌ తరహాలోనే చనిపోయారన్నారు.

అలాగే ఏపీలోని గ్యాస్ నిక్షేపాలను స్థానిక అవసరాలకు వాడాలని వైఎస్ పట్టుబడ్డారని… ఆ తర్వాతి కొద్ది కాలానికి ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారన్నారు. గ్వాటిమాలా, ప‌నామా దేశాధ్యక్షుల మరణంపై విచారణ జరపగా అవి హత్యలని తేలిందన్నారు. వైఎస్ మరణంపైనా కరెక్టుగా విచారణ జరిపితే అసలు విషయం తెలుస్తుందన్నారు.
    
వైఎస్‌ మరణవార్త విని చనిపోయిన వారిని పరామర్శించేందుకు జగన్‌ సిద్ధమైతే సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మక్కై జగన్‌ను జైలుకు పంపారని ఆరోపించారు. చంద్రబాబు ప్రజాకంటకుడని భూమన వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు