వారంలో పళని ప్రభుత్వం అవుట్.. స్టాలిన్ జోష్యం

వారంలో పళని ప్రభుత్వం అవుట్.. స్టాలిన్ జోష్యం

తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం గట్టిగా మరో వారం కంటే ఎక్కువ కాలం నిలవబోదని  డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ అన్నారు . ఈ నెల 14న, ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల నాటికి ఆ ప్రభుత్వం ఉంటుందో లేదో చెప్పలేమని ఆయన అన్నారు.  అన్నాడీఎంకే ఇప్పటికే మూడు ముక్కలైందని, భవిష్యత్తులో ఎన్ని ముక్కలౌతుందో ఊహించడం కష్టమని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
   
కాగా ఇటీవ‌లే ఈడీ కేసులో బ‌య‌టకు వ‌చ్చిన దిన‌క‌ర‌న్ పార్టీపై ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నాలు మొదలెట్టారు. బెంగ‌ళూరు జైలులో చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌ను క‌లిసిన వ‌చ్చిన త‌ర్వాత వ‌రుస‌గా ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చలు జరిపారు. అయితే ఈ మీటింగ్‌ల‌పై ముఖ్యమంత్రి పళనిస్వామి సీరియస్ గా స్పందించారు. పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ కూడ దినకరన్ తో సమావేశం కాకూడదని హెచ్చరించారు.

ఇటు ముఖ్య‌మంత్రి కార్యాల‌యంతో పాటు అన్నాడీఎంకే ఆఫీసుల్లో శ‌శిక‌ళ ఫోటోల‌ను ముఖ్య‌మంత్రి తీసి వేయించారు. దీంతో అన్నాడీఎంకేలో  దిన‌క‌ర‌న్,ప‌ళ‌నిస్వామి వ‌ర్గాల మ‌ధ్య పోరు ముదురుతోంద‌ని..... ప్రభుత్వం ఏ నిమిషంలోనైనా కూలిపోవచ్చని స్టాలిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
   
అయితే... స్టాలిన్ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినా డీఎంకే వైపు నుంచి బలం పుంజుకుని ప్రభుత్వాన్ని ఏర్పరిచే సాహసం మాత్రం చేయలేకపోయారు. దీంతో పళినస్వామి ప్రభుత్వం పోవడమన్నది అన్నాడీఎంకేలో చీలికల వల్లే కావాలి కానీ స్టాలిన్ వల్ల కాదని తమిళనాడు రాజకీయవర్గాలు అంటున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు