ఏపీ, తెలంగాణ‌పై కేంద్రానికి భ‌లే డౌట్ వ‌చ్చింది

ఏపీ, తెలంగాణ‌పై కేంద్రానికి భ‌లే డౌట్ వ‌చ్చింది

తెలంగాణ‌, ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై కేంద్ర ప్ర‌భుత్వానికి భ‌లే సందేహం వ‌చ్చింది. ఏక‌కాలంలో రాజధాని కూడా లేకుండానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 2015లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ర్యాంక్ పొందడం, 13వ ర్యాంక్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏడాది తిరక్కుండానే మొదటి ర్యాంక్ సాధించడం ఎలా సాధ్యమైందని కేంద్రం దృష్టి సారించింది. తమ పోర్టల్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమాచారాన్ని తస్కరించడం వల్లనే ఆ రాష్ట్రం రెండవ ర్యాంక్ తెచ్చుకోగలిగిందని గతంలో తెలంగాణ ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు తమ రాష్ట్రం కల్పించిన వౌలిక సదుపాయాలు, ప్రోత్సహకాల వల్లనే తమకు ర్యాంక్ వచ్చింది తప్ప తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది కూడా. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సంస్కరణలను రాష్ట్రాలు ఏ మేరకు అమలు చేస్తున్నాయో క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన తర్వాతనే ర్యాంక్‌లు ఇవ్వాలని కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయించింది.

పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు, వౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు, సులభతరం, పారదర్శకత తదితర 340 అంశాలపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని ఎంత శాతం మేరకు పూర్తి చేశారో దాని ఆధారంగానే రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను ప్రకటిస్తుంది. ఇప్పటివరకు ఈ మార్గదర్శకాలు పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే నివేదికల ఆధారంగానే కేంద్రం ర్యాంక్‌లు ప్రకటిస్తూ వచ్చింది. ఇక నుంచి అలా కాకుండా రాష్ట్రాలు పంపించే నివేదికలను గుడ్డిగా విశ్వసించకుండా క్షేత్రస్థాయిలో వాటి అమలు జరుగుతుందా? లేదా? అధ్యయనం చేయడానికి కేంద్ర బృందాలు ఈ ఏడాది నుంచి రాష్ట్రాల్లో పర్యటించ‌నున్నాయి. అంటే గ‌తంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో (ఈఓడీబీ) ర్యాంక్‌లు సాధించడం ఇక ముందు అంత ఈజీ కాదన్న‌మాట‌


ఇదిలాఉండ‌గా...ఈఓడీబీ ర్యాంకింగ్‌లో టాప్-5లో ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం గత ఆరు నెలలుగా చర్యలు తీసుకుంటోంది. పరిశ్రమల శాఖ మంత్రి గా కే తారకరామారావు బాధ్యతలు స్వీకరించాక ఈఓడీబీ ప్రత్యేక దృష్టి సారించారు. ఈఓడీబీ సంస్కరణల అమలులో 13 సచివాలయ విభాగాలు, 27 శాఖలు భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో గుజరాత్ రాష్ట్రాన్ని కూడా వెనక్కి నెట్టి నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తెలంగాణ రాష్ట్రం.. ఈ ఏడాది (2017-18) కూడా తన స్థానాన్ని నిలిబెట్టుకోవడానికి చర్యలు చేపట్టాల‌ని ఆదేశించారు.

పరిశ్రమల స్థాపనకు సంబంధించిన 26 చట్టాలను సవరించడంతోపాటు 50 కొత్త ఉత్తర్వులను, 121 సర్క్యులర్లను జారీ చేసింది. అయినప్పటికీ కొన్ని శాఖలు ఇంకా సంస్కరణలు అమలు చేయడంపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మంగళవారం శాఖాధిపతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం సూచించిన 405 సంస్కరణలలో అన్ని శాఖలు 265 సంస్కరణలను మాత్రమే పూర్తి చేయడంపట్ల పెదవివిరిచారు. మిగిలిన 140 సంస్కరణలను ఎట్టి పరిస్థితులలో ఈ నెల 15 వరకు పూర్తి చేయాలని శాఖాధిపతులను ఆయన ఆదేశించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు