పాపం... జగన్ ను ఓదార్చేవారే లేరా?

పాపం... జగన్ ను ఓదార్చేవారే లేరా?

ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అధినేత... చంద్రబాబుకు ఏకైక ప్రత్యామ్నాయం జగన్ ఊహించని చిక్కుల్లో పడ్డారు. చంద్రబాబును చిక్కుల్లో నెట్టేందుకు వేసిన బలమైన సొంత రాజకీయ వ్యూహమే ఆయన మెడకు చుట్టుకుంటోంది. దీంతో ‘తాదూర కంత లేదు మెడకో డోలు’ అన్నట్లుగా జగన్ పరిస్థితి మారింది.  పాలన మాట ఎలా ఉన్నా ప్రజల్లో ఆదరణతో టీడీపీ, చంద్రబాబు రెండోసారి కూడా అదికారం అందుకోవడానికి కదం తొక్కుతున్న తరుణంలో ఆయన్ను ఎదుర్కోవడానికి వ్యూహాలు రచిస్తున్న జగన్ చంద్రబాబును ఇరుకుపెట్టేలా ప్రత్యేక హోదా అంశాన్ని భుజాన వేసుకున్నారు. కానీ, అదే ఇప్పుడు ఆయన పాలిట ఇప్పుడు భారంగా మారింది. ముఖ్యంగా జీరోలో ఉన్న కాంగ్రెస్ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని... ఏపీలో ఈ టెర్ములో అధికారంలోకి రావడం కల అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకుని... కనీసం కొన్ని స్థానాలను గెలుచుకుని మళ్లీ ఫినిక్స్ పక్షిలా పైకి లేవాలన్న తాపత్రంయంతో తన రాజకీయ అనుభవమంతా రంగరించి వేసిన వ్యూహాత్మక ఉచ్చులో జగన్ పడిపోయారు. దీంతో అంతర్గతంగా అంత మంచిగా సంబంధాలు లేని బీజేపీ. టీడీపీ మైత్రి మధ్యలోకి ఎంటరై బీజేపీకి ఇప్పుడిప్పుడే బాగా చేరువవుతున్న జగన్ ముందరి కాళ్లకు కాంగ్రెస్ బంధం వేయగలిగింది. కాంగ్రెస్ ఎంతో పరిణతితో వేసిన ఈ రాజకీయ ఉచ్చు జగన్ మెడ చుట్టూ బిగుసుకుని గత ఎన్నికల్లో సంపాదించుకున్న స్థానాలు కూడా ఈసారి సంపాదించుకోగలరా అన్న సందేహం కలిగించే స్థాయికి చేర్చింది.

మొన్నటి ఏపీ కాంగ్రెస్- రాహుల్ గాంధీ గుంటూరు సభను ఒకసారి విశ్లేషించుకుంటే జగన్ కు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకానున్నాయన్నది చాలా స్పష్టంగా అర్థమయిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది అన్ని రాజకీయ వర్గాలకే కాదు జగన్ పార్టీ వైసీపీ నేతలకూ అర్థమై విపరీతంగా టెన్షన్ పెట్టేస్తోంది.

చంద్రబాబు నిర్మొహమాటంగా వదిలించుకున్న ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ భుజాన వేసుకున్నారు. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అవసరాల నేపథ్యంలో మోడీ అపాయింటుమెంటు కూడా సాధించి ఆయనతో భేటీ అయిన జగన్ నిజానికి నిన్నమొన్నటి వరకు చంద్రబాబుకు దడ పుట్టించారు. కానీ.. రాహుల్ గాంధీ సభతో సీనంతా రివర్సయింది. ప్రత్యేక హోదాను భుజాన వేసుకున్న జగన్ మోడీకి రాష్ర్టపతి ఎన్నికల్లో మోడీ పక్షం ఎలా వహిస్తారంటూ కాంగ్రెస్ వేసిన ప్రశ్నకు వైసీపీ నుంచి సమాధానమిచ్చేవారే లేరు.

నిజానికి ప్రత్యేక హోదాను భుజాన వేసుకున్నది జగన్ ఒక్కరే కాదు. కొత్త రాజకీయ పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీ అదే బాట. కాంగ్రెస్ దీ అదే మాట. సీట్ల పరంగా ఏపీలో శూన్యమైపోయినా సుదీర్ఘ ప్రస్థానం నేపథ్యంలో కాంగ్రెస్ కు ఇంకా సానుభూతి పరులు ఉన్నారు. వారంతా అయిదేళ్ల విరామం తరువాత 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎంతో కొంత అనుకూలంగా వ్యవహరించబోతున్నారు.  ఈ క్రమంలో ప్రత్యేక హోదా డిమాండుతో సాధించుకోబోయే రాజకీయ లబ్ధిని జగన్ ఒక్కరే కాదు పవన్, కాంగ్రెస్ కూడా పంచుకోబోతున్నాయి.

అయితే... చంద్రబాబును దెబ్బకొట్టడానికి ప్రత్యేక హోదాను భుజానికెత్తుకున్న జగన్ ఇప్పుడు మోడీతో మైత్రి వల్ల దాన్ని ఎప్పుడు పక్కన పెట్టేద్దామా అని చూస్తున్నారు. కానీ... కాంగ్రెస్ దెబ్బకు ఆయన దాన్ని వదిలిపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో వదిలేస్తే ప్రజలతో తంటా.. వదలకపోతే బీజేపీకి టార్గెట్ అవుతారు. సో... ఇప్పుడు జగన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారిపోయింది.

ఇప్పుడు ఏపీలో పవన్, కాంగ్రెస్ పార్టీ బలపడితే ఆ దెబ్బ కచ్చితంగా జగన్ మీదే ఉంటుంది.  జగన్ పవన్ కళ్యాణ్‌తో ఎలాగూ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో బిజెపికి ఎలాగు అధికారంలోకి వచ్చే బలం లేదు. కాబట్టి ఆ పార్టీతోను అంతర్గత ఒప్పందానికి జగన్ సిద్ధపడ్డారు. టిడిపిని దోషిగా నిలబెట్టి... 2019 ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తున్నారు. కానీ, ఇప్పుడు సీను రివర్సవడంతో ఇదంతా చంద్రబాబుకే లాభించేలా ఉందన్నది విశ్లేషకుల మాట. ప్రత్యేక హోదా ను వదిలేస్తే జగన్ కు చిత్తశుద్ధి లేదన్న విషయం జనాలకు పూర్తిగా అర్థమైపోతుంది... వదలకపోతే బీజేపీ జగన్ ను టార్గెట్ చేస్తుంది. కేసులను కానీ బిగిస్తే జగన్ పని అంతే... అయ్యో జగన్ ఎంత కష్టమొచ్చింది...? నిన్ను ఓదార్చేవారు ఎవరయ్యా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు