అమ్మ‌కానికి విప్రో.. ఎన్డీటీవీ?

అమ్మ‌కానికి విప్రో.. ఎన్డీటీవీ?

కొన్నిసార్లు సీజ‌న‌ల్ వార్త‌లు వ‌స్తుంటాయి. తాజాగా వ‌స్తున్న వార్త‌లు చూస్తుంటే.. ప్ర‌ముఖ కంపెనీల‌న్నీ అమ్మ‌కానికి సిద్ధంగా ఉన్న‌ట్లుగా వార్త‌లు రావ‌టం క‌నిపిస్తోంది. నిన్న‌టికి నిన్న ప్ర‌ముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీపై సీబీఐ దాడుల‌న్న వార్త‌లు వ‌చ్చిన కాసేప‌టికే.. ఆ మీడియా సంస్థ‌ను కొన‌టానికి  ప్ర‌ముఖ యోగా గురువు రాందేవ్ బాబా సిద్ధంగా ఉన్నారంటూ వార్త‌లు వ‌చ్చేశాయి. అయితే.. ఇందులో ఎంత‌మాత్రం నిజం లేదంటూ ఎన్డీటీవీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి.

తాజాగా అలాంటి వార్తే మ‌రొక‌టి బిజినెస్ వ‌ర్గాల్లో హ‌డావుడి చేస్తోంది. దేశంలో అత్యంత సంప‌న్నుల్లో ఒక‌రైన విప్రో కంపెనీ అధినేత అజిమ్ ప్రేమ్ జీ త‌న ఐటీ కంపెనీ అయిన విప్రోను అమ్మేస్తున్న‌ట్లుగా వార్త రావ‌టం సంచ‌ల‌నంగా మారింది. నిజానికి విప్రో కంపెనీ ఈక్విటీలో 73 శాతం ప్రేమ్ జీ కుటుంబ స‌భ్యుల చేతిలోనే ఉంది. మ‌రి.. అలాంట‌ప్పుడు అంత పెద్ద కంపెనీని ప్రేమ్ ఈ ఎందుకు అమ్మేయాల‌నుకుంటున్నార‌న్న క్వ‌శ్చ‌న్‌కు వస్తున్న స‌మాధానం ఏమిటో తెలుసా? అమెరికాలో ట్రంప్ కార‌ణంగా నెల‌కొన్న ఐటీ ఇబ్బందుల‌ని బ‌దులివ్వ‌టం క‌నిపిస్తోంది. నిజంగానే ప్రేమ్ జీ త‌న విప్రోను అమ్మేయ‌నున్నారా? అంటే.. అలాంటిదేమీ లేద‌ని కంపెనీ వ‌ర్గాలు స్ప‌ష్టంగా కొట్టిపారేస్తున్నారు.

అయితే.. మార్కెట్ వ‌ర్గాలు.. కొన్ని మీడియా సంస్థ‌లు మాత్రం.. తాము అచ్చేసిన వార్త‌ల్ని స‌మ‌ర్థించుకునేలా త‌మ వాద‌న‌ల్ని వినిపించ‌టం.. అమ్మ‌కాల‌కు సంబంధించి స‌రికొత్త వార్త‌ల్ని వేయ‌టం క‌నిపిస్తోంది. త‌న కంపెనీ విలువ‌ను స‌రిగా మ‌దింపు చేయ‌టం కోసం ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకుల‌ను సంప్ర‌దించిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత‌న్న‌ది చూస్తే.. విప్రో విలువ‌ను మ‌దింపు చేయాల‌ని ఆ కంపెనీ కోరిన‌ట్లుగా చెప్పిన బ్యాంక‌రు త‌న వివ‌రాలు చెప్ప‌క‌పోవ‌టం చూస్తేనే ఈ వార్త‌ల్లో నిజం ఎంత‌న్న‌ది అర్థ‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ట్రంప్ పేరు చెప్పి.. మ‌రికొన్ని కంపెనీలు కూడా అమ్మ‌కానికి ఉన్న‌ట్లుగా వార్త‌లు రావ‌టం క‌నిపిస్తోంది. భార‌త ఐటీ కంపెనీల్నిఎందుకు అమ్మాల‌నుకుంటున్నారు? అన్న క్వ‌శ్చ‌న్ ను వేస్తే వ‌స్తున్న స‌మాధానం ఏమిటంటే.. అమెరికా వీసాల దెబ్బ‌తో పాటు లాభాలు త‌గ్గ‌టం.. కొత్త ప్రాజెక్టులు అంతంత‌మాత్రంగా ఉండ‌టంతో.. ఉన్న ఉద్యోగుల్ని ఇంటికి పంపుతున్నార‌ని.. న‌ష్టాల భ‌యంతో కంపెనీల్ని అమ్మ‌కాల‌కు పెడుతున్నారంటూ చెబుతున్నారు. అయితే.. ఇదంత నిజం కాద‌న్న మాటను ప‌లువురు నిపుణులు చెబుతున్నారు. ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఏదో ఒక ఇబ్బంది వ్యాపారంలో మామూలేన‌ని.. వాటిని స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు కంపెనీలు వ్యూహాలు సిద్ధం చేస్తాయే కానీ.. అదే ప‌నిగా అమ్ముకోవ‌న్న మాట‌ను చెబుతున్నారు.  అమ్మ‌కానికి కంపెనీల‌న్న వార్త‌ను రాసినంత ఈజీగా నిర్ణ‌యాలు జ‌ర‌గ‌వ‌న్న మాట‌ను ఒక పారిశ్రామిక‌వేత్త వ్యాఖ్యానించ‌టం చూస్తేనే.. ఈ వార్త‌ల్లోని నిజం ఎంత‌న్న‌ది అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. సో.. ఆ కంపెనీ అమ్మేస్తున్నారు.. ఈ కంపెనీ అమ్మేస్తున్నార‌న్న వార్త‌ల్ని చూసినంతనే హ‌డావుడి ప‌డాల్సిన అవ‌స‌రం అస్స‌లే లేద‌న్న మాట మార్కెట్ వ‌ర్గాల నోటి వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English