విప్రోను అమ్మేస్తున్నారట‌

విప్రోను అమ్మేస్తున్నారట‌

దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన విప్రోను పూర్తిగా లేదా కొన్ని యూనిట్లను విక్రయించే ప్రతిపాదనతో ప్రేమ్‌జీ ఫ్యామిలీ పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లను ఆశ్రయించినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. విప్రో ప్రమోటర్, చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, ఆయన కుటుంబం సంస్థ నుంచి పాక్షికంగా లేదా పూర్తిగా వైదొలగాలనుకుంటున్నట్లు సమాచారం. వాటాను అంతర్జాతీయ ఐటీ కంపెనీకి లేదా ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు అమ్మాలనుకుంటున్నారట. విప్రోలో వీరికి 73 శాతానికిపైగా వాటా ఉంది.

విప్రోలో తమకు ఉన్న వాటాలకు ఎంత విలువ లభిస్తుందని తెలుసుకునేందుకు ప్రేమ్‌జీ కుటుంబం బ్యాంకులను సంప్రదించిందని బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారని జాతీయ మీడియా క‌థ‌నం రాసింది. సంస్థ విలువను లెక్కగట్టాల్సిన బాధ్యతను బ్యాంకులకు అప్పగించినట్లు వెల్లడించింది. అయితే వాటా విక్రయ ప్రతిపాదన పట్టాలెక్కుతుందని నిశ్చయంగా చెప్పలేమని స‌ద‌రు అధికారి అన్న‌ట్లు వివ‌రించారు. అయితే ఈ విషయాన్ని ఖండించిన విప్రో.. ఇందులో నిజం లేదని తెలిపింది. విప్రో నుంచి ప్రమోటర్ల ఎగ్జిట్‌పై మర్చంట్ బ్యాంకర్లలో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఐటీ రంగంలో పెరిగిన సవాళ్లు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి.

ఐటీ రంగంలో వృద్ధి మందగించినప్పటికీ సంస్థల వద్ద భారీగా నగదు నిల్వలున్న నేపథ్యంలో వాటా కొనుగోలుకు విదేశీ కంపెనీలు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఆసక్తి చూపవచ్చని ఓ మర్చంట్ బ్యాంకర్ అన్నారు. వచ్చే 12-18 నెలల్లో భారత్‌కు చెందిన పలు ఐటీ కంపెనీల్లో యాజమాన్య మార్పులు రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండ‌గా...ఈనెల 1 నుంచి అమలులోకి వచ్చేలా విప్రో సంస్థ ఉద్యోగుల జీతాలను పెంచింది. ఆఫ్‌షోర్‌లో పనిచేసే సిబ్బందికి 9.5 శాతం, ఆన్‌సైట్ ఉద్యోగులకు 2 శాతం పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు