ఇస్రో అద్భుతం..జీశాట్‌-19 స‌క్సెస్‌

ఇస్రో అద్భుతం..జీశాట్‌-19 స‌క్సెస్‌

భార‌తదేశం టెక్నాల‌జీ రంగంలో మ‌రో అద్భుతాన్ని సృష్టించింది. ఆ అద్భుతం ఇస్రో ఖాతాలో ప‌డింది. జీశాట్‌-19 ఉప‌గ్ర‌హం ఇవాళ క‌క్ష్య‌లోకి చేర్చ‌డం ద్వారా  ఇస్రో మ‌రో చ‌రిత్రాత్మ‌క ప్ర‌యోగాన్ని స‌క్సెస్‌ఫుల్‌గా ముగించింది.జీఎస్ఎల్వీ మార్క్‌-3డీ1 రాకెట్ ఈ ఉప‌గ్ర‌హాన్ని మోసుకువెళ్లింది. 960.8 సెక‌న్ల‌లో జీశాట్‌-19 విజ‌య‌వంతంగా కక్ష్య‌లోకి చేరుకున్న‌ది. జీశాట్ సుమారు మూడు వేల కిలోల బ‌రువు ఉంది. ఇది క‌మ్యూనికేష‌న్ శాటిలైట్‌. ఉప‌గ్ర‌హం క‌క్ష్య‌లోకి చేరుకోగానే శాస్త్ర‌వేత్త‌లు సంబ‌రాల్లో తేలారు. జీశాట్ ప‌దేళ్ల పాటు క‌మ్యూనికేష‌న్ సేవ‌ల‌ను అందిచ‌నుంది. ఇక నుంచి భార‌త్‌కు సొంత క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ ఉంటుంది. స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారైన ఈ శాటిలైట్ అధిక రేటు డేటాను అందిచ‌గ‌ల‌దు అని శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. స్పేస్ టెక్నాల‌జీలో ఇదో పెను విప్ల‌వం తీసుకువ‌స్తుంద‌ని ఇస్రో పేర్కొంది.

శ్రీహ‌రికోట నుంచి జీఎస్ఎల్వీ మార్క్‌-3డీ1 రాకెట్ సాయంత్రం 5.28 నిమిషాల‌కు ఎగిరింది. ప్ర‌తి ద‌శ‌లోనూ ప్ర‌యోగం నార్మ‌ల్‌గా సాగింది. జీఎస్ఎల్వీలో అతిపెద్ద క్ర‌యోజెనిక్ ఇంజిన్ ఉంది. ఇంత పెద్ద ఇంజిన్‌ను త‌యారు చేయ‌డం ఇస్రో చ‌రిత్ర‌లోనే తొలిసారి. నాలుగు టన్నుల ఈ అంతరిక్ష వాహక నౌక ప్ర‌యోగం కోసం ఆదివారం సాయంత్రం 3:58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జీఎస్ఎల్వీ విలువైన పేలోడ్‌ను మోసుకువెళ్లింది.

ఇస్రో చరిత్రలోనే అతిపెద్ద ప్రయోగం కావడంతో శాస్త్రవేత్తలు ప్రతీఅంశాన్ని జాగ్రత్తగా ప‌ర్య‌వేక్షించారు. 200 పెద్ద ఏనుగుల బరువుతో సమానమైన జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 వాహకనౌక దేశీయంగా తయారైన అత్యంత భారీ రాకెట్.

ఇప్పటివరకు ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్లను మాత్రమే ప్రయోగించిన ఇస్రో భవిష్యత్తులో మానవ సహిత ప్రయోగాలు నిర్వహించేందుకు మార్క్3-డీ1 భారీ ఉపగ్రహ వాహకనౌకను రూపొందించింది. దశాబ్దాల శ్రమ, 18 ఏండ్ల ప్రయోగాల ఫలితమే మార్క్-3 అంతరిక్ష వాహకనౌక. ఇందుకోసం ఇప్పటివరకు రూ.300 కోట్లు వెచ్చించింది. ఈసారి 25టన్నుల క్రయోజనిక్ ఇంజిన్‌తో ప్రయోగాన్ని నిర్వ‌హించారు. దీని ద్వారా ఐదు టన్నుల బరువున్న ఉపగ్రహాలను సైతం కక్ష్యలో ప్రవేశపెట్టవచ్చు. వ్యోమనాట్ (ఇస్రో పరిభాషలో దేశీయ ఆస్ట్రోనాట్)ల రోదసీయానంపై మార్క్-3 ప్రయోగం కొత్త ఆశలు చిగురింపజేయనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు