ఆ సీఎం గ‌బ్బు పోగొట్టేందుకు 16 అడుగుల స‌బ్బు?

ఆ సీఎం గ‌బ్బు పోగొట్టేందుకు 16 అడుగుల స‌బ్బు?

యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ అంటే జ‌నాల్లో ఎంత క్రేజ్ వ‌స్తోందో అంతే స్థాయిలో విమ‌ర్శ‌లూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న్ను వ్య‌తిరేకించే వ‌ర్గాలూ త‌క్కువేం కాదు. ఆయ‌న క‌ర‌డుగ‌ట్టిన హిందూత్వ వాది అని... ముస్లిం, ద‌ళిత వ్య‌తిరేకి అన్న ప్ర‌చార‌మూ ఉంది. ఈ నేప‌థ్యంలో గుజ‌రాత్ కు చెందిన ఓ ద‌ళిత సంస్థ నేత‌లు యోగి తీరును నిర‌సిస్తూ.. ఆయ‌న‌కున్న కుల వివ‌క్ష  పోవాలంటూ ఏకంగా 16 అడుగుల సబ్బును ఆయ‌న‌కు పంపిస్తున్నారు.  'గుజరాత్ దళిత్ , అంబేద్క‌ర్ ప్ర‌తిబంద్ స‌మితి అనే ఆ సంస్థల‌ నేతలు ఈ మేర‌కు ప్రకటించారు. ఈ సబ్బుతో ఆయన తన కుల వివక్షను కడిగేసుకోవాలని వారు సూచిస్తున్నారు..

 అయితే, ఈ గుజ‌రాత్ ద‌ళిత్ సంస్థ నేత‌లు ఇలా చేయ‌డానికి వెనుక ఉన్న కార‌ణం కూడా చెప్తున్నారు. ఇటీవ‌ల యోగి... యూపీలోని కుషినగర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఉన్న దళితవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులు అక్కడి దళితులకు సబ్బులు, షాంపూలు, పౌడర్లు, సెంట్ సీసాలు ఇచ్చారు. సీఎం యోగిని కలవాలనుకునేవారు శుభ్రంగా స్నానం చేసి, పౌడరు, సెంటు కొట్టుకోవాలని చెప్పారు.  దీనిపై గుజ‌రాతీ ద‌ళిత్ సంస్థ మండిప‌డుతోంది.  అస‌లు గ‌బ్బు పోగొట్టుకోవాల్సింది సీఎం యోగి అని... ఆయ‌న దళితులను కలిసేందుకు వచ్చేముందు తాము పంపిస్త‌న్న 16 అడుగుల స‌బ్బుతో స్నానం చేసి రావాల‌ని అంటున్నారు.

 అంతేకాదు, అహ్మాదాబాద్ లో ఈ నెల 9వ తేదీన జరిగే  ఓ కార్యక్రమంలో ఈ భారీ సబ్బును ప్రదర్శనకు ఉంచనున్నారు. ఆ తర్వాత దాన్ని ప్యాక్ చేసి యోగికి పంపిస్తార‌ట‌.  దళితుల్లోని వాల్మీకి వర్గానికి చెందిన ఓ మహిళతో ఈ సబ్బును తయారు చేయిస్తున్నారట. మొత్తానికి ప్ర‌ధాని సొంత రాష్ర్టం నుంచి యోగికి గొప్ప కానుకే అంద‌బోతుంద‌న్న‌మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు