హైద‌రాబాద్‌లో ఏం చేయాలేక‌పోయాము

హైద‌రాబాద్‌లో ఏం చేయాలేక‌పోయాము

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ త‌న ప‌రిధిలోని హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధిపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తెలంగాణ స‌ర్కారు మూడేళ్ల పాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ నగరంలో కార్యక్రమాల అమలుపై అసంతృప్తిగా ఉన్నానని అన్నారు.

గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో నగర ప్రజలు త‌మకు చిరస్మరణీయ విజయాన్ని అందించారని అయితే వాటిని నెర‌వేర్చ‌లేక‌పోయాన‌ని అంగీక‌రించారు. అందుకే మున్సిపల్ మంత్రిగా సవాల్‌గా తీసుకుంటున్నాన‌ని చెప్తూ  వచ్చే రెండేళ్ల‌లో హైదరాబాద్‌ను అభివృద్ధిని చేసి చూపెడుతామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

హైదరాబాద్ రోడ్లను సమీకృతంగా అభివృద్ధి చేయాలన్న నిర్ణయానికొచ్చామ‌ని కేటీఆర్ తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో వెయ్యి కోట్లను సేకరిస్తామ‌న్నారు. ఈమధ్య కార్పొరేటర్లపై మీడియాలో కథనాలొచ్చాయని చెప్పిన కేటీఆర్  విచారణ జరిపించి నిజమని తేలితే క్రమశిక్షణ చర్యల్ని చేపడుతామ‌న్నారు.

జీహెచ్‌ఎంసీ నాలా పూడికతీతలో అవినీతిని తాను స్వయంగా గుర్తించి 12 మంది ఇంజినీర్లను సస్పెండ్ చేశానని కేటీఆర్ గుర్తు చేశారు. నిన్న మియాపూర్ భూభాగోతం విషయంలో కఠిన చర్యల్ని చేపట్టామ‌ని తెలిపారు. పరిపాలనలో జరుగుతున్న లోటుపాట్లను సవరించడం, అవినీతిని అరికట్టడం ఒక నిరంతర ప్రక్రియ అని కేటీఆర్ వివ‌రించారు.

కాగా త‌మ ప‌రిపాల‌న గురించి వివ‌రిస్తూ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ప్రజల ముందు ఆవిష్కరించామ‌ని కేటీఆర్‌ తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను అమలు చేశామ‌న్నారు. హరితహారంలో ప్రజలను భాగస్వామ్యం చేశామ‌ని, దేశం మెచ్చుకునే పాలనను కేసీఆర్ అందిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో భారీ వర్షాలు పడినప్పుడు ఆరుగురు మంత్రులం రాత్రీపగలు ఎంతో కమిట్‌మెంట్‌తో కష్టపడ్డాం కాబట్టే.. త‌మ‌తో పాటు ప్రజలున్నారని తెలిపారు. తాము ప్రజలకు జవాబుదారి తప్ప ప్రతిపక్షాలకు కానే కాదని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

 తమిళనాడు, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో కావేరి జల వివాదాలు ఏర్పడితే రాజకీయాలను పక్కనపెట్టి ఒక్కటవుతాయని కానీ, ఇక్కడ ప్రతిపక్షాలు చనిపోయిన వారి పేరుతో ప్రాజెక్టులు అడ్డుకోవడానికి కేసులు వేస్తున్నాయని కేటీఆర్ మండిప‌డ్డారు. ఈ ఆలోచ‌న‌లను ప్రతిపక్షాలు సరిదిద్దుకోవాల్సిన అవసరముందని అయితే... వారి బుద్ధిమారుతుందని అనుకోవడం లేదన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు