అమెరికా టీజ‌ర్ తో ఉత్త‌ర కొరియాకు షాక్‌

అమెరికా టీజ‌ర్ తో ఉత్త‌ర కొరియాకు షాక్‌

పిచ్చోడి చేతిలో రాయి మాదిరి.. త‌న చేతిలో అణ్వ‌స్త్ర ఆయుధాల్ని అమెరికా మీద ప్ర‌యోగిస్తానంటూ త‌ర‌చూ నోరు పారేసుకునే ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్‌కు అమెరికా షాకిచ్చే కార్య‌క్ర‌మాన్ని షురూ చేసింది. అగ్ర‌రాజ్యం అన్న‌ది పేరుకు మాత్ర‌మే కాద‌ని..త‌మ‌కున్న స‌త్తా ఎంత‌న్న విష‌యాన్ని టీజ‌ర్ రూపంలో ప్ర‌పంచానికి చాటి చెప్పే ప‌ని చేసింది.
తాము ఖండాంత‌ర క్షిప‌ణిని త‌యారు చేస్తున్నామ‌ని.. అమెరికాలోని ఎక్క‌డికైనా టార్గెట్ చేసి.. అగ్ర‌రాజ్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తామంటూ గ్రాఫిక్ వీడియోను త‌యారు చేసుకొని ముచ్చ‌ట ప‌డే ఉత్త‌ర‌కొరియాకు.. రియ‌ల్ వీడియోను టీజ‌ర్ గా తీసుకొచ్చింది అమెరికా.

ఖండాంత‌ర క్షిప‌ణుల్ని త‌న‌కున్న ఆయుధ సంప‌త్తితో.. వాటిని మార్గ‌మ‌ధ్యంలోనే విచ్ఛిన్నం చేసే బాలిస్టిక్ క్షిప‌ణిని తాము ప‌రీక్షించిన‌ట్లుగా అమెరికా ఇప్ప‌టికే స‌మాచారాన్ని బ‌య‌ట పెట్ట‌టం తెలిసిందే.

తాజాగా.. తాను చెబుతున్న‌ది మాట‌లు మాత్ర‌మే కాద‌ని.. చేత‌ల్లో కూడా త‌మ‌కా స‌త్తా ఉంద‌న్న విష‌యాన్ని ఫ్రూవ్ చేసేలా.. యుఎస్ మిస్సైల్ డిఫెన్స్ ఏజెన్సీ ఒక వీడియోను విడుద‌ల చేసింది. దాదాపు 70 సెక‌న్ల‌కు పైనే ఉన్న ఈ వీడియోలో.. ఒక డమ్మీ ఖండాంత‌ర క్షిప‌ణిని ప్రయోగించి.. మ‌రో టార్గెట్ నుంచి దాన్ని విచ్ఛిన్నం చేసే ఇంట‌ర్ సెప్టార్ స‌త్తాను ప్ర‌ద‌ర్శించింది.

క్షిప‌ణి ర‌క్ష‌ణ‌ వ్య‌వ‌స్థ‌ల అధ్య‌య‌నంలో ఇదో ముంద‌డుగుగా అభివ‌ర్ణిస్తున్నారు. త‌న తాజా వీడియోతో క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ఏ విధంగా ప‌ని చేస్తుంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టంగా చూపించ‌టం చూస్తే.. అగ్ర‌రాజ్యానికి త‌న స‌త్తా ఏమిటో చెప్పాల్సిన వారికి చెప్పేసింద‌ని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు