చాలాకాలం తరువాత చంద్రబాబుపై కేసీఆర్ ఫైర్

చాలాకాలం తరువాత చంద్రబాబుపై కేసీఆర్ ఫైర్

సెంట్రల్ నుంచి స్టేట్ల ముందస్తు ఎన్నికల మాట బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మొహమాటాలు వదిలి మాటల ఈటెలు విసురుతున్నారు. మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు గడ్డి పెట్టి పంపించిన ఆయన తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును కూడా ఏకి పడేశారు. చాలాకాలంగా చంద్రబాబు, కేసీఆర్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదు. కానీ... మహానాడులో టీటీడీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో కేసీఆర్ కూడా తానేంటో చూపించారు. చంద్రబాబు మహానాడులో చెప్తున్నవన్నీ అసత్యాలేనంటూ ఆయన విరుచుకుపడ్డారు.  ఏపీ ప్రజలను మోసగించిన  చంద్రబాబు వారికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండు చేశారు.

తాము ఎన్నిక‌ల మానిఫెస్టోలో చెప్పిన అంశాల‌ను 100 శాతం అమ‌లు చేశామ‌ని చెప్పిన కేసీఆర్ రుణమాఫీ విషయంలో చంద్రబాబును కడిగిపారేశారు. శనివారం విశాఖలో చంద్ర‌బాబు నాయుడు టీడీపీ మ‌హానాడులో ఎన్నో అస‌త్య వ్యాఖ్య‌లు చేశార‌ని కేసీఆర్ ఆరోపించారు. ‘మేము తెలంగాణ‌లో రైతుల రుణ‌మాఫీ పూర్తిగా చేశాం. అదే ప‌క్క రాష్ట్రంలో చంద్ర‌బాబు నాయుడు చేయ‌లేదు.. మోసం చేశాడు. నిన్న ఎన్నో మాట్లాడాడు. ఆంధ్ర రైతుల‌కు, ఆంధ్ర డ్వాక్రా మ‌హిళ‌ల‌కు టోపీ పెట్టిన చంద్ర‌బాబు ఇంక తెలంగాణలోకి వ‌స్తాడ‌ట‌. మొట్ట‌మొద‌ట నీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పు. నువ్వు చెప్పింది ఏంటీ.. డ్వాక్రా మహిళలందరికీ రుణాలు మాఫీ చేస్తా అన్నావ్‌.. రైతుల మొత్తం రుణాలు మాఫీ చేస్తా అన్నావ్‌.. అంతా మోసం’’ అంటూ మండిపడ్డారు.

ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన చంద్రబాబు వంటివారికి తెలంగాణ‌లో స్థానం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు తెలంగాణకు అవ‌స‌రం లేదని... ఏపీలో ఏం చేసుకుంటావో చేసుకో కానీ  తెలంగాణ‌కు నువ్వు వ‌చ్చినా ఇక్క‌డ నీకు వ‌చ్చేదేమీ ఉండ‌దు.. డిపాజిట్లు కూడా ద‌క్క‌వు అని చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు