రియల్ స్టారూ... మీకు మరణం లేదు సారూ!

రియల్ స్టారూ... మీకు మరణం లేదు సారూ!

అన్నగా కనిపించాలన్నా...
అన్నకు నమ్మిన బంటుగా నటించాలన్నా...
భర్తగా కనిపించాలన్నా, బాధ్యత కలిగిన పౌరుడిగా ఒదిగిపోవాలన్నా...
పోలీసుగానైనా.. పోకిరీ పనులు చేసే పచ్చి రౌడీగానైనా...
ఇలా దర్శకుడి ఊహల్లో ఎన్ని పాత్రలున్నా సరే...  వాటికి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేయగల నటుడు...  శ్రీహరి. అందుకే ఆయన రియల్ స్టార్ అనిపించుకున్నారు. తెరపై గంభీరంగా ఓ డైలాగు చెబితే చాలు... అదొక ఫైటును తలపిస్తుంది. ఇక ఫైటు చేశాడంటే మాత్రం.. థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో మహా నటులు ఎంతమంది ఉన్నప్పటికీ వారిమధ్య తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకున్న నటుడు శ్రీహరి. ఆయన పక్కనుంటే మా పాత్రలకు కాస్త ఎలివేట్ అవుతాయని కథానాయకులు సైతం ఆశపడే స్థాయికి ఎదిగిన నటుడు శ్రీహరి. అలాంటి ఓ మంచి నటుడు మనకు దూరమయ్యాడన్న విషయాన్ని ఇప్పటికీ చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. మొత్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ శ్రీహరి లాంటి ఓ ఆణిముత్యాన్ని కోల్పోయింది. ఆయన బుధవారం సాయంత్రం ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్రీహరి... ముంబైలో తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచారు. ఆయన ప్రభుదేవా దర్శకత్వంలో `రాంబో రాజ్ కుమార్` అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణకోసమని వెళ్ళిన శ్రీహరి అక్కడ సెట్ లోనే అనారోగ్యానికి గురై కుప్పకూలిపోయారు. దీంతో చిత్ర బృందం ఆయన్ని హుటాహిటిన లీలావతి ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు మూడు దశాబ్దాల ప్రయాణం ఆయనది. మొదట `బ్రహ్మనాయుడు` అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ కథానాయకుడిగా మారారు. 28 సినిమాలు కథానాయకుడిగానే చేశారు.  సుమారుగా వంద సినిమాలలో రకరకాల పాత్రలు పోషించిన  ఆయనకు ఎన్నో పురస్కారాలు దక్కాయి. `నువ్వొస్తానంటే నేనోద్దంటానా` చిత్రంలో త్రిషకి అన్నగా నటించి అలరించారు. ఆ పాత్రకు ప్రతిష్టాత్మకమైన నంది అవార్డు లభించింది. భాషపై పట్టున్న నటుడు శ్రీహరి. ఆయన అన్నిరకాల యాసలను మాట్లాడుతూ ప్రేక్షకులను రక్తికట్టిస్తుంటారు. `ఢీ` సినిమాలో శంకర్ గౌడ్ పాత్రలో ఆయన ఒదిగిపోయిన విధానం నభూతో నభవిష్యత్ అనేలా ఉంటుంది. అలాగే కింగ్, డాన్ శీను, అహనా పెళ్ళంట తదితర చిత్రాల్లో శ్రీహరి డైలాగులు చెప్పిన విధానం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తాజ్ మహల్, హలో బ్రదర్, ప్రేమించుకుందాం రా తదితర చిత్రాల్లో శ్రీహరి నటనలో  వైవిద్యం ఏంటో చూపిస్తాయి. ఆయన పోలీసు పాత్రలకు పెట్టింది పేరు. ఆ మాటకొస్తే ఆయన `పోలీసు` అనే సినిమాతోనే కథానాయకుడిగా మారారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఖాకీ డ్రెస్సు వేసుకొని అలరించారు. సినిమా అనేది సామాజిక బాధ్యతతో కూడుకొని ఉండాలని చెప్పేవారు శ్రీహరి. ఆ తరహా కథల్లోనే నేను కథానాయకుడిగా నటిస్తా అనేవారు. చివరివరకు ఆయన అదే మాటకు కట్టుబడే ఉన్నారు.

`మగధీర` తర్వాత శ్రీహరి కాస్త షేర్ ఖాన్ అయ్యారు. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతిఒక్కరూ షేర్ ఖాన్ పాత్రను ఇష్టపడతారు. `భైరవా... కమ్ముకున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయి రా... ఈ చీకటి కడుపును చీల్చుకుంటూ నువ్వు మళ్ళీ పుడతావు రా... `  అంటూ చెప్పిన డైలాగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన `తుఫాన్` సినిమాలోనూ షేర్ ఖాన్ గానే కనిపించారు. అందులోనూ శ్రీహరి నటన చాలా బాగుంటుంది. శ్రీహరి రాజకీయ రంగంలో కూడా చురుకైన పాత్ర పోషించారు. వైయస్సార్ హయాంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆ తర్వాత కొంతకాలం పార్టీకి దూరమయ్యారు. ఇటీవల మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఆయన ప్రాణాలతో ఉండుంటే వచ్చే శాశనసభ ఎన్నికల్లో కుకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు శ్రీహరి. తన కూతురు అక్షర పేరుతొ ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలుగ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. మొన్న ఆగస్టు 15న  అభిమానుల మధ్య పుట్టిన రోజును జరుపుకున్న శ్రీహరి తన జీవితం గురించి చిట్టచివరిగా కొన్ని విషయాలు చెప్పారు. ``నటుడిగా నిరుపించుకున్నా.  తల్లిదండ్రులతో మంచి బిడ్డ అనిపించుకున్నా. నా భార్యతో మంచి భర్త అనిపించుకున్నా, పిల్లలతో మంచి  నాన్న అనిపించుకున్నా. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి`` అన్నారు.  శ్రీహరి అంటే ఓ చరిత్ర.  శ్రీహరి అంటే మంచి తనానికి ఓ ఆకారం. అలాంటి వ్యక్తికి మరణం ఉంటుందా. భౌతికంగా ఆయన మనమధ్య లేకపోవచ్చు కానీ.. ఆయన జ్ఞాపకాలు మాత్రం తరతరాలుగా కొనసాగుతాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు