కేంద్రంపై కోపం చూపిస్తే కాంగ్రెస్ సస్పెండ్ చేసింది..

కేంద్రంపై కోపం చూపిస్తే కాంగ్రెస్ సస్పెండ్ చేసింది..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన సొంత పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. నిరసన తెలిపిన విధానం దారుణంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. పశువధపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ కేరళలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన తెలిపారు. కానీ, అందుకు వారు ఎంచుకున్న మార్గమే కరెక్టుగా లేదు. దీంతో బయట నుంచి విమర్శల వర్షాన్ని ఎదుర్కోవడం కష్టమై కాంగ్రెస్ పార్టీ మేలుకొని వారిపై సస్పెన్షన్ వేటు వేసింది.

కేరళలో కొందరు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నిరసన తెలుపుతూ  బహిరంగంగా ఓ ఎద్దు తలను నరికారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సైతం ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఒక పశువును బహిరంగంగా వధించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ దారుణానికి కారణమైన నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కేరళ కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్లయింది.