టీడీపీ లీడ‌ర్ ఏడ్చారు

టీడీపీ లీడ‌ర్ ఏడ్చారు

కొన్ని విష‌యాలు పెద్ద‌వి కాకుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. వేడుక జ‌రిగే స‌మ‌యంలో జ‌రిగే లోటుపాట్లు కార్య‌క్ర‌మ స్ఫూర్తిని దెబ్బ తీసే ప్ర‌మాదం ఉంది. ఇలాంటివి ఎక్క‌డైనా ఓకే కానీ.. రాజ‌కీయ వేదిక‌ల మీద అస్స‌లు చోటు చేసుకోకూడ‌దు. ఏమైందో ఏమో కానీ.. టీడీపీ అధినాయ‌క‌త్వం వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రికి సినీ న‌టి.. టీడీపీ ఆర్గ‌నైజింగ్ కార్య‌ద‌ర్శి క‌విత తీవ్రంగా నొచ్చుకున్నారు.

త‌న‌ను తీవ్రంగా అవ‌మానించార‌ని క‌న్నీరుమున్నీరు అయ్యారు. టీడీపీలో మ‌హిళ‌ల‌కు క‌నీసం గౌర‌వం లేద‌ని.. సినిమా వాళ్లంటే మ‌రీ చిన్న‌చూపు అంటూ మండిప‌డిన ఆమె.. గ‌డిచిన మూడేళ్లుగా ఎన్నో అవ‌మానాల‌కు గురి చేశార‌ని.. ఇప్ప‌టికీ చేస్తున్నార‌ని వాపోయారు. ఇలాంటి పార్టీలో ఇంకా కొన‌సాగాల్సిన అవ‌స‌రం ఉందా? అంటూ సూటిగా ప్ర‌శ్నించిన ఆమె మ‌హానాడులో మీడియా ముందు కంట త‌డి పెట్టారు.

మ‌హానాడు వేదిక మీద‌కు త‌న‌ను ఆహ్వానించ‌లేద‌న్న ఆమె.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు త‌న‌ను వేదిక మీద పిలిచార‌ని.. ప‌వ‌ర్‌లోకి వ‌చ్చాక ప‌ట్టించుకోవ‌టం మానేశార‌న్నారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి త‌న‌ను ప‌క్క‌న పెట్టేశార‌ని... గ‌తంలోనూ త‌న‌కు ఇలాంటి అవ‌మాన‌మే జ‌రిగింద‌న్నారు. 2015 మ‌హానాడులో ఇలాంటి అవ‌మాన‌మే జ‌రిగింద‌ని.. గ‌త ఏడాది తిరుప‌తిలో జ‌రిగిన మ‌హానాడుకు రాలేద‌ని. ఈసారి కూడా రాకూడ‌ద‌ని అనుకున్నాన‌ని చెప్పారు. కానీ.. ఎమ్మెల్యే అనిత ర‌మ్మ‌ని ఆహ్వానించ‌టంతో వ‌చ్చాన‌ని.. త‌న‌ను వేదిక మీద‌కు రాకుండా చేశార‌న్నారు.

పార్టీ కోసం రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డాన‌ని.. ఫ్యామిలీని వ‌దిలేసి మ‌రీ తిరిగిన త‌న‌ను ఇంత‌గా అవ‌మానిస్తారా? అని ప్ర‌శ్నించిన ఆమె.. ఇంత‌లా అవ‌మానించే పార్టీలో కొన‌సాగాలా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. మహానాడు వేదికపైకి తనను పిలవకుండా అవమానించడం పట్ల మీడియా వద్ద ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. త్వ‌ర‌లో త‌న అనుచ‌రులు.. కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించి త‌గునిర్ణ‌యం తీసుకుంటాన‌న్నారు. మ‌హానాడులో క‌విత ఎపిసోడ్ ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించ‌టంతో పాటు.. వేదిక‌పై ఆహ్వానించ‌కుండా లేనిపోని లొల్లి తెచ్చి పెట్టుకున్నార‌న్న మాట‌ను ప‌లువురు అనుకోవ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు