భార్యాపిల్ల‌ల్ని బండిపై తోసుకుంటూ 700 కిలోమీట‌ర్లు

లాక్ డౌన్ వేళ వ‌ల‌స కార్మికుల క‌ష్టం చూస్తే ఎవ్వ‌రికైనా క‌న్నీళ్లు రాక మాన‌వు. ఉన్న చోట ప‌ని లేక‌, తిండి, వ‌స‌తి కొర‌వ‌డి.. ఈ క‌ష్టం ఎందుకులే అని సొంతూళ్ల‌కు త‌ర‌లి వెళ్లిపోతున్నారు కార్మికులు. ఐతే ప్ర‌యాణ సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో వంద‌ల కిలోమీట‌ర్లు న‌డిచి అయినా వెళ్లిపోవ‌డానికి సిద్ధ‌మైపోయారు ఎంతోమంది.

త‌మ సామాను నెత్తిన పెట్టుకుని.. పిల్ల‌ల్ని సైతం న‌డిపించుకుంటూ వంద‌ల కిలోమీట‌ర్లు సాగిపోతున్నారు. ఈ క్ర‌మంలో అల‌సి సొల‌సి.. ఒళ్లు హూనం అయిపోయి.. తిండి దొర‌క్క వాళ్లు ప‌డుతున్న క‌ష్టాలు చూస్తే గుండె త‌రుక్కుపోతోంది. చిన్న చిన్న పిల్ల‌లు ఆక‌లితో రోడ్ల మీద అల‌మ‌టిస్తున్న.. కాళ్ల నొప్పులు భ‌రించ‌లేక బోరున విలపిస్తున్న దృశ్యాలు హృద‌య విదార‌కంగా ఉన్నాయ. వీళ్ల క‌ష్టాల‌కు సంబంధించిన అనేక వీడియోలు సోష‌ల్ మీడియాను క‌దిలిస్తున్నాయి.

కాగా ఓ వ‌ల‌స కార్మికుడు తాను క‌ష్ట‌ప‌డ్డా.. త‌న భార్య‌, బిడ్డ‌లు ఇబ్బంది ప‌డొద్ద‌ని ఓ చిన్న ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చిన్న తోపుడు బండిని త‌యారు చేసుకున్నాడు. దాని మీద భార్యతో పాటు త‌న బిడ్డ‌ను కూడా కూర్చోబెట్టాడు. ముందు ఇనుప హ్యాండిల్ ప‌ట్టుకుని లాక్కుంటూ వెళ్లాడు. ఇలా ఏకంగా అత‌ను 700 కిలోమీట‌ర్ల దూరం వెళ్ల‌డం గ‌మ‌నార్హం.

హైద‌రాబాద్‌లో ప్ర‌యాణం ఆరంభించి మ‌ధ్య ప్రదేశ్‌లోని బాలా ఘాట్ వ‌ర‌కు అత‌ను ప్ర‌యాణం సాగించాడు. మ‌ధ్య‌లో తిండికి ఇబ్బంది ప‌డ్డా ప్ర‌యాణం మాత్రం ఆప‌లేదు. ఏకంగా 17 రోజుల పాటు ఇలా ప్ర‌యాణం చేసి అత‌ను స్వ‌స్థ‌లానికి చేరాడు. మామూలుగా న‌డ‌వ‌డ‌మే క‌ష్టం అంటే ఎండ‌లో ఇలా బండిని లాక్కుంటూ వెళ్ల‌డానికి అత‌నెంత క‌ష్ట‌ప‌డి ఉంటాడో అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి ద‌య‌నీయ వీడియోలు మ‌రెన్నో సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నాయి.